ఉస్మానియా విద్యార్థినికి అమెజాన్ లో రూ.45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం-hyderabad osmania student gets job at amazon with 45 lakh rupees package ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఉస్మానియా విద్యార్థినికి అమెజాన్ లో రూ.45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

ఉస్మానియా విద్యార్థినికి అమెజాన్ లో రూ.45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

HT Telugu Desk HT Telugu

ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు భారీ ప్యాకేజీలో క్యాంపస్ ప్లేసెమెంట్ లో అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. సునందన అమెజాన్ లో రూ.45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను వీసీ ఘనంగా సన్మానించారు.

ఉస్మానియా విద్యార్థినికి అమెజాన్ లో రూ.45 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు 2024- 2025 సంవత్సరానికి జరిగిన క్యాంపస్ ప్లేసెమెంట్ లో అద్బుత్తమైన ఉద్యోగాలను కొల్లగొట్టారు. బీఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మషీన్ లెర్నింగ్ (AIML) శాఖల విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో ప్రతిష్టాత్మక ఉద్యోగ అవకాశాలను, భారీ ప్యాకేజీలను పొందారు.

భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు

సునందన- అమెజాన్ లో రూ. 45 లక్షల ప్యాకేజీ

ఐరాజ్ ఫాతిమా-జస్ట్ పే లో రూ.27 లక్షల ప్యాకేజీ

మొహమ్మద్ ఆరిఫ్- డీఈ షా- రూ.24.85 లక్షల ప్యాకేజీ

ఎస్.ఏ. నదీమ్ - డీఈ షా- రూ.24.85 లక్షల ప్యాకేజీ

ఉస్మానియా పేరు నిలబెట్టాలి

ఈ అద్భుతమైన విజయాల గుర్తించి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, వీసీ నివాసంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల అంకితభావం, అకడమిక్ ప్రతిభ, నిరంతర పట్టుదలపై ప్రశంసలు కురిపించారు. ఈ అవకాశాలను పొందడంలో వారి ప్రయత్నం, నైపుణ్యం విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు నైతికత, నేర్చుకోవడం, సేవ అనే విలువలను తమ వృత్తిపరమైన జీవితాల్లో కొనసాగించాలని ప్రోత్సహించారు. దేశ అభివృద్ధికి సాంకేతికంగా ముందుండే రీతిలో వారు తమ కృషితో విశ్వవిద్యాలయానికి గౌరవాన్ని తీసుకువస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంటెర్న్ షిప్ అవకాశాలు

ఈ సందర్భంగా విద్యార్థిని సునందన మాట్లాడుతూ... తను మూడో సంవత్సరం తరువాత అమెజాన్ లో ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఈ అవకాశాన్ని అందుకున్నానని వివరించారు. ఐరాజ్ ఫాతిమా మాట్లాడుతూ....డేటా స్ట్రక్చర్లు, అల్గోరిథంలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటి ప్రాథమిక సూత్రాలపై పట్టు వల్లే తన విజయానికి దారితీసిందని తెలిపారు. ఇప్పటికే రెండు ఆఫర్లను పొందిన మొహమ్మద్ ఆరిఫ్, ఎస్.ఏ. నదీమ్ తమ కలల కంపెనీ అయిన DE SHAW లో చేరుతున్న ఆనందాన్ని వ్యక్తపరిచారు.

సంబంధిత కథనం