Hyderabad ORR Lease : లీజుకు ఓఆర్‌ఆర్, 30 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థదే బాధ్యత!
Outer Ring Road - TOT: ఓఆర్ఆర్ లీజ్ ఖరారైంది. ఏడాదికి పైగా ఇదే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… గురువారం క్లారిటీ వచ్చింది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) విధానంలో మొత్తం 30 ఏళ్లపాటు లీజుకు అప్పగించారు.

Outer Ring Road Lease: భాగ్యనగరానికి మణిహారమైన 158 కి.మీ. ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు) ను లీజ్ ఇచ్చే అంశంపై ఏడాదికిపైగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. 30 ఏళ్ల పాటు దీర్ఘకాలికమైన లీజు గురువారం ఖరారైంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) విధానంలో 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చే ఒప్పందం కుదిరింది.
ఈ టెండర్ దక్కించుకునేందుకు నాలుగు కంపెనీలు టెండర్ల కోసం బిడ్లు దాఖలు చేయగా... దరఖాస్తుల పరిశీలన తర్వాత ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ ఎల్1గా నిలిచింది. మొత్తం రూ.7,380 కోట్లకు బిడ్ ఖరారైంది. ఈ మొత్తం ఒకేసారి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. లీజు కుదరటంతో ఇక నుంచి నిర్వహణ నుంచి టోల్ వసూలు వరకు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్లనున్నాయి.
గతేడాది కాలంగా దీనిపై కసరత్తు చేస్తోంది హెచ్‌ఎండీఏ. అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. మార్చి నెలాఖరుకు టెండర్ గడువు ముగిసిన తర్వాత మొత్తం 4 కంపెనీలు తమ బిడ్లను దాఖలు చేశాయి. బిడ్లు దాఖలు చేసిన కంపెనీలకు సంబంధించిన సాంకేతిక అంశాల పరిశీలన పూర్తికాగా, ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి అధికారులు అధ్యయనం చేశారు. అన్ని అర్హతలు ఉన్న కంపెనీని గుర్తించి, ఎక్కువ కోట్ చేసిన కంపెనీకి ఓఆర్‌ఆర్ టీవోటీని అప్పగించారు. ఇందులో భాగంగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కి బిడ్ దక్కింది. ఓఆర్‌ఆర్ మొత్తం 158 కిలోమీటర్ల మేర నిర్మించారు. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. ఈ రోడ్డుపై ఎక్కి, దిగడానికి 44 పాయింట్లతో పాటు 22 ఇంటర్ ఛేంజ్ జంక్షన్లు ఉన్నాయి. టోల్ వసూళ్ల కింద ఏటా రూ.400-450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డును హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోంది. విద్యుత్ లైట్లు, ఇంటర్ ఛేంజ్‌లు, సర్వీస్ రహదారుల నిర్వహణ, మరమ్మతులు, భద్రత చూస్తోంది. నిధులు, మానవ వనరుల కొరతతో నిర్వహణ భారంగా మారుతోంది. తాజా లీజ్ తో ఓఆర్‌ఆర్‌పై ఆస్తులను పర్యవేక్షించడంలో హెచ్‌ఎండీఏకు భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యం కారణంగా ఓఆర్‌ఆర్‌పైన మెరుగైన నిర్వహణ కొనసాగుతుంది. ముఖ్యంగా టోల్ వసూలు, సాధారణ నిర్వహణలో భాగంగా గుంతలు, పగుళ్లు, కాలువలు, జాయింట్ల మరమ్మతులు చేయడం, అవసరమైనప్పుడు టోలింగ్ వ్యవస్థను పునరుద్ధరించడం వంటి లీజ్ సంస్థనే నిర్వహించాల్సి ఉంటుంది. తాజా బిడ్ ఫైనల్ కావటంతో ప్రభుత్వానికి ఒకేసారి భారీగా ఆదాయం సమకూరింది.
సంబంధిత కథనం