TS Weather : తెలంగాణను వణికిస్తున్న చలి, సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు
TS Weather : తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 8-10 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.
TS Weather : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి చలి గాలులు విస్తుండడంతో....గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శని, ఆదివారాల రాత్రి పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భేలలో 9.2, బజార్ హతునుర్ లో 9.3, పోచ్చేరా లో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు శనివారం నమోదు అయ్యాయి.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాబోయే 2-3 రోజులు చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర,ఈశాన్యం నుంచి వీస్తున్న గాలులు కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. చలికి తోడు పొగ మంచు కూడా భారీగా పేరుకుపోతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు వీడటం లేదు. దీంతో వాహనదారులకు రహదారులపై తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రతలు 25- 30 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.
చలికి తోడు పొగ మంచు
సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లాను భారీగా మంచు కమ్మేసింది. నాందేడ్ - అఖోల జాతీయ రహదారి 161 పై పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 10 దాటినా.....రోడ్డు పై పొగమంచు అలానే ఉంటుంది. జాతీయ రహదారిపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు తప్పని పరిస్థితుల్లో లైట్లు వేసుకొని నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా చలి అంతే తీవ్రతతో ఉంది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా