RGV Vyooham Movie : వ్యూహం సినిమా విడుదలపై మరో ట్విస్ట్, సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు-hyderabad news in telugu ts high court orders vyooham cinema release hearings in single bench ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rgv Vyooham Movie : వ్యూహం సినిమా విడుదలపై మరో ట్విస్ట్, సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు

RGV Vyooham Movie : వ్యూహం సినిమా విడుదలపై మరో ట్విస్ట్, సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు

RGV Vyooham Movie : ఆర్జీవీ వ్యూహం సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ జడ్జి బెంచ్ లోనే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 8న సినిమా విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ను ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టు

RGV Vyooham Movie : ఏపీ సీఎం జగన్ రాజకీయ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం. అయితే ఈ సినిమా విడుదలకు ఆటంకాలు తప్పడంలేదు. ఈ చిత్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ పాత్రలను దురుద్దేశపూర్వకంగా చూపించారని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతల వద్ద డబ్బులు తీసుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించారని కోర్టులో పిటిషన్ చేశారు. సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్ విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. అప్పటి వరకూ సినిమాను విడుదల చేయొద్దని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ వ్యూహం చిత్రం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 8న విచారణ

దాసరి కిరణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వ్యూహం సినిమా విడుదలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ నిర్మాత ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా విడుదల నిలిచిపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈనెల 11కు బదులు 8న విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా నిర్మాత కోర్టును కోరారు. దీంతో ఈనెల 8న వ్యూహం సినిమాపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జ్ కు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. వ్యూహం నిర్మాత వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్పోజ్ చేసింది.

గత విచారణలో

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం అక్రమమని, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్‌ జారీ చేశారని ఆరోపిస్తూ నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా ద్వారా రాజకీయ లబ్ధి పొందడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతోనే సినిమా తీశారని పిటిషనర్‌ ఆరోపించారు. ఇప్పటికే సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపి వేయాలంటూ లోకేశ్‌, టీడీపీలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే దురుద్దేశంతో సినిమా తీశారని వాదించారు. నిర్మాణ సంస్థ రామధూత క్రియేషన్స్‌ అడ్రస్‌, సీఎం అడ్రస్‌ ఒకటేనని పేర్కొన్నారు. సినిమా తీసే ఆర్థిక స్థోమత నిర్మాత దాసరి కిరణ్‌కు లేదని, వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు.