TS DSC Notification : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో 10 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!
TS DSC Notification : తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం...మొదటి కానుకగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తుంది.
TS DSC Notification : తెలంగాణలో డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కు ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఖాళీల వివరాలు సేకరిస్తు్న్నారు. ఈ ఏడాది 3800 మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నారు. పదవీ విరమణ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో 5,089 టీచర్ల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కారణంగా రాత పరీక్ష నిర్వహణ నిలిచిపోయింది. దీంతో ఆ నోటిఫికేషన్ కు అనుబంధంగా పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని సమాచారం.

గత నోటిఫికేషన్ కు అనుబంధంగా
గత నోటిఫికేషన్‌కు అదనంగా మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. సీఎంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి... డీఎస్సీ రాతపరీక్షను వచ్చే నెలలో నిర్వహిస్తామని ప్రకటించారు.
10 వేల పోస్టులతో మెగా డీఎస్సీ
ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించే స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు దాదాపు 1,500 వరకు భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతుల విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో మొత్తం మంజూరైన టీచర్ల పోస్టులు 1.22 లక్షలు కాగా, ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే హైదరాబాద్ 370 పోస్టులు, మేడ్చల్‌లో 260, ఖమ్మం 240, రంగారెడ్డి 210, సంగారెడ్డి 200, నిజామాబాద్‌లో 190 మంది టీచర్లు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. మర్చి, జూన్ నెలల మధ్యలో టీచర్ల పదవీ విరమణలు ఉన్నాయి. దీంతో మొత్తం 10 వేలకు పైగా ఖాళీలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది.
త్వరలో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీ సర్కార్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే గ్రూప్-1,2 నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు శాఖాపరమైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో సుమారు 6 వేల నుంచి 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ పై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖలో 18,500 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.