TS DSC Notification Cancelled : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, 11 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్!
TS DSC Notification Cancelled : తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 11,062 టీచర్ పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
TS DSC Notification Cancelled : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను(TS DSC Notification) రద్దు చేసింది. కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో రేపు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్న విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2023 సెప్టెంబర్ లో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటికేషన్ ప్రభుత్వం రద్దు చేసింది. రేపు దాదాపు 11 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. దీంతో గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు
ఎన్నికల కారణంగా వాయిదా
గత ఏడాది సెప్టెంబర్ లో 5,089 టీచర్ల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కారణంగా రాత పరీక్ష నిర్వహణ నిలిచిపోయింది. దీంతో ఆ నోటిఫికేషన్ కు అనుబంధంగా పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది.
గత నోటిఫికేషన్‌కు అదనంగా మరో 6 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారుల కసరత్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్ 8న తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం.
మెగా డీఎస్సీ
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఒకటి రెండ్రోజుల్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11062 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం. విద్యాశాఖలో మొత్తం 21 వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలున్నట్లు విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో ప్రస్తుతం 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో 6500 పోస్టులు ఎస్జీటీలు ఉన్నారని సమాచారం. అయితే స్పెషల్ ఎడ్యుకేటర్ 1523 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత డీఎస్సీ నోటిఫికేషన్ లో ఈ పోస్టులను జోడించలేదు. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఆ 1523 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని సమాచారం.