Ration Card e-KYC : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అలర్ట్ జారీ చేసింది. జనవరి 31వ తేదీ లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు కాగా, గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో డీలర్లు ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలను సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు ఇవ్వరని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి రేషన్ లబ్దిదారులు జనవరి 31వ తేదీ లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ కు లింక్ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా రేషన్ అందిస్తోంది. అయితే బోగస్ రేషన్ కార్డులను ఏరివేతకు రేషన్ కార్డుతో ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఈకేవైసీ అప్డేట్ గడువును పొడిగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పొడిగించింది. జనవరి 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోకుంటే రేషన్ బియ్యం ఇవ్వమని ఉత్తర్వుల్లో తెలిపింది. ఆధార్ కార్డుతో లింక్ చేయని రేషన్ కార్డును బోగస్ గా పరిగణించి తొలగిస్తామని ప్రకటించింది. రేషన్ కార్డు డిలీట్ అయితే ప్రభుత్వ డేటాలో ఆ వివరాలు ఉండవని, రేషన్ షాపులకు వెళ్లినా రేషన్ ఇవ్వరని తెలిపింది. తెలంగాణలో డిసెంబర్ 30 నాటికి 70.80 శాతం ఈకేవైసీ పూర్తి అయినట్లు సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు.