Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య మరో 6 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగాలో ఏపీకి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 15వ తేదీ మధ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరింది.
తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. జనవరి 10వ తేదీన తిరుపతి నుంచి ఉదయం 05.30 నిమిషాలకు బయల్దేరి.... మరునాడు 05.15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, కర్నూలు, గద్వాల, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది. ఇక సికింద్రాబాద్ - కాకినాడ మధ్య ప్రత్యేక టైన్ ను ప్రకటించింది. ఈ ట్రైన్ జనవరి 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 7 గంటలకు కాకినాడకు చేరుతుంది. ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.
ఇక కాకినాడ టౌన్ నుంటి సికింద్రాబాద్ కు కూడా మరో సర్వీస్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు జనవరి 11వ తేదీన కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. మరోవైపు జనవరి 12వ తేదీన సికింద్రాబాద్ - కాకినాడ మధ్య మరో ట్రైన్ నడపనుంది రైల్వే శాఖ. ఈ ట్రైన్ సాయంత్రం 06.5 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.... మరునాడు తెల్లవారుజామున 05.30 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ - తిరుపతి మధ్య జనవరి 13వ తేదీన ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం బయల్దేరి... మరునాడు తెల్లవారుజామున 04.30 నిమిషాలకు తిరుపతికి చేరుతుంది. ఇవే కాకుండా సికింద్రాబాద్ - బరంపుర, వికారాబాద్ - బరంపుర, బరంపుర - సికింద్రాబాద్, విశాఖపట్నం - కర్నూలు, కర్నూలు - విశాఖపట్నం, శ్రీకాకుళం - వికారాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య కూడా మరిన్ని ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి.
వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన 32 ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాల మధ్య నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు నడుపుతామని చెబుతున్నారు.