Rachakonda Cyber Crime : రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్-మాకొద్దీ పోస్టింగ్!
Rachakonda Cyber Crime : రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్ లో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపుతున్నారు. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినా... పైరవీలతో వేరే చోటికి బదిలీ చేయించుకుంటున్నారు.
Rachakonda Cyber Crime : రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Rachakonda Cyber Crime PS) ఉత్సవ విగ్రహంలో మారింది. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినా..... పైరవీలతో ఒక్కటి రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారులు లేక కేసులు దర్యాప్తు అటకెక్కింది. దీంతో సైబర్ బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.
రాచకొండ సైబర్ ఠాణాలో ఒకే ఒక్క ఇన్స్ పెక్టర్
రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్ లో డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు దాదాపు 70 మంది సిబ్బంది ఉంటారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పోలీస్ శాఖలో బదిలీల క్రమంలో అప్పటి మహిళా డీఎస్పీ వేరే చోటకు బదిలీ అయ్యారు. ఆ తరువాత కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ పోస్ట్ ఇటీవలే భర్తీ చేశారు. అదే సమయంలో ఏసీపీని సైతం చేశారు. కానీ కేవలం ఒకటి రెండు రోజుల్లోనే మల్టీ జోన్ 2కి తిరిగి బదిలీపై వెళ్లారు. దీంతో ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. ఇక ఇన్స్పెక్టర్లు మాకొద్దీ పోస్టింగ్ అంటూ పారిపోతున్నారు. ఒకప్పుడు రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్ లో ఏడుగురు ఇన్స్పెక్టర్ ఉండగా ప్రస్తుతం ఒక్కరూ మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) నేపథ్యంలో బదిలీ అయిన ఇన్స్పెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించారు కానీ రిపోర్ట్ కూడా చేయకుండానే పైరవీలతో ఒకటి రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ బాటా పడుతున్నారు.
కానిస్టేబుళ్ల పరిస్థితి భిన్నం
రాచకొండ సైబర్ ఠాణాలో కానిస్టేబుళ్ల పరిస్థితి మాత్రం మిగతా అధికారుల కంటే భిన్నంగా ఉంది. ఐదేళ్ల నుంచి ఇదే ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు సుమారు 10 మంది ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించినా..... ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. వేరే చోటుకు వెళితే పని భారం పెరుగుతుందనో లేక ఇతర ఆలోచనతోనే ఇక్కడే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వీరికి వర్తించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జేబుకు చిల్లు తప్ప గుర్తింపు లేదు
సైబర్ నేరాల్లో(Cyber Crimes) భాగంగా.....ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణ అధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలన పడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబుకు చిల్లు తప్ప ప్రయోజనం ఉండడం లేదని పలువురు పోలీసులు అధికారులు వాపోతున్నారు. ఒకవేల కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్ తరలిస్తే ఉన్నతాధికారులు దృష్టిలో గుర్తింపు ఉంటుందా? అంటే అదీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి , పని భారం పెరిగిందని, కేసులు దర్యాప్తు వేగంగా పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్ కి ఇబ్బంది అవుతుందని అధికారులు భయపడుతున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం