OYO Bookings Rank : ప్రముఖ హోటల్ బుకింగ్ ఫ్లాట్ ఫామ్ ఓయో బుకింగ్స్ 2023 ఏడాదికి సంబంధించిన నివేదిక తాజాగా విడుదల అయింది. ఆయా నగరాల్లో ఈ ఏడాది బుకింగ్స్ ర్యాంక్ జాబితాను ఓయో సోమవారం విడుదల చేసింది.
2023 ఏడాదికి గాను దేశంలోనే ఎక్కువ బుకింగ్స్ నమోదైన నగరంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బెంగళూరు, దిల్లీ, కోల్ కత్తా ఉన్నాయి. అయితే గోరక్ పూర్, వరంగల్,గుంటూరు వంటి నగరాలు కూడా గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎక్కువగా బుకింగ్స్ నమోదు అయినట్లు తెలిపింది. ఖాళీ సమయంలో ఎక్కువ మంది సందర్శించిన ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా,మైసూర్,పుదుచ్చేరి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరి టాప్ లో నిలవగా.... అమృత్ సర్, వారణాసి, హరిద్వార్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తక్కువ మందికే పరిచయం ఉన్న దేవ్ గడ్, ఫలని, గోవర్ధన్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా గతేడాదితో పోలిస్తే మెరుగైన వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది.
రాష్ట్రాల వారీగా ఎక్కువ మంది టూరిస్టులు పర్యటించిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా......తెలంగాణ మూడో స్థానంలో, ఆంధ్రపదేశ్ నాలుగో స్థానంలో ఉంది. కరోనా తరువాత పర్యాటక రంగం దాదాపు సాధారణ స్థితికి చేరుకుందని ఓయో ట్రవెలోపిడియా తెలిపింది. కరోనా తరువాత కొత్త ప్రదేశాలకు సందర్శన పెరిగిందని.....ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ గడ్బోలే అన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఎక్కువగా బుకింగ్స్ నమోదైనట్లు ఓయో తెలిపింది. ఈ సంవత్సరం అత్యధికంగా బుకింగ్స్ అయిన నెల మే అని చెప్పింది. ఇతర లాంగ్ వీకెండ్స్ తో పోల్చితే.....సెప్టెంబర్ 30- అక్టోబర్ 2 మధ్య లాంగ్ వీకెండ్ రావడంతో అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని
ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ గడ్బోలే వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్