Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలు అమలుపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతూ రెండు కీలక హామీలను అమల్లోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న రూ.500 లకే సిలిండర్ పథకం అమలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వంద రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీని అమలుచేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖలో తప్పులు జరిగాయని ఆరోపించారు.
పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...పౌర సరఫరాల శాఖ చాలా తప్పులు జరిగాయని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టంలో ఉందన్నారు. రాష్ట్రంలో 12 శాతం అర్హులైన వారు రేషన్ కార్డులు ఉపయోగించడంలేదని, ఆ రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని ఆదేశించామన్నారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో కీలక పథకాలు అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పథకం అమలు గురించి ఓ లీక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని అన్నారు. ఎన్నికల కారణంగా నిలిచిపోయిన రైతుబంధు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామన్న ఆయన రైతు భరోసా అమలుకు విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 28న సంక్షేమ పథకం అమలు అన్న వ్యాఖ్యలపై ఆసక్తి మొదలైంది. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైంది. దీనిపై ఇప్పటికే వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు క్యూకట్టారు. కేవైసీ అప్డేట్ కోసం బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున ఈ పథకం లేదా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న పథకాన్ని ప్రారంభిస్తారా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.