TSPSC : టీఎస్పీఎస్సీ సభ్యుల్లో స్థానికేతర వ్యక్తి, చర్చకు తెరలేపిన ప్రభుత్వ నిర్ణయం!
TSPSC : టీఎస్పీఎస్సీ బోర్డు నియామకంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉన్న మాజీ డీజీపీ మహేంద్రరెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ చేయడంతో పాటు ఏపీకి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
TSPSC : ఇటీవలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియామకమైంది. తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా, అలాగే సభ్యులుగా అనిత రాజేంద్ర ఐఏఎస్, పాల్వాయి రజిని కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, ఏరపతి రామ్మోహన్ రావులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీ సభ్యుడిగా ఉన్న రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. ఉద్యోగుల విభజన సందర్భంగా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్న 214 మందిలో రామ్మోహన్ రావు ఒకరు. అయితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించి తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వలేదు. రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకొని టీఎస్‌జెన్‌కోలో ఈడీగా కొనసాగుతున్నారు. ఏప్రిల్ లో పదవీ విరమణ కావాల్సిన రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అవకాశం కల్పిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొత్త బోర్డు నియామకంపై విమర్శలు?
బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉండే తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి ఛైర్మన్ గా నియమించిన తరువాత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించడం ఏంటనే చర్చ జరుగుతుంది. ఏపీకి బదులు తెలంగాణ వారిని సభ్యులుగా నియమిస్తే బాగుటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న సర్వీస్ కమిషన్ నియామక బోర్డుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ బోర్డును రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. కానీ ఛైర్మన్, మెంబర్లను అపాయింట్ చేసిన తర్వాత విమర్శలు రావడం కొత్త ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిందని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగుల విభజనలో
రామ్మోహన్ రావు ది కృష్ణాజిల్లాగా చూపిన కమిటీ రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలను 58 : 43 నిష్పత్తిలో విభజించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు విభజన కమిటీ ఉద్యోగుల విభజన పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో ఏపీ స్థానికత ఉన్న సుమారు 300 మంది ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులను విభజన చేసిన సమయంలో ప్రతి ఉద్యోగి స్థానికత, కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొంది. అందులో రామ్మోహన్ రావును కృష్ణాజిల్లా వాసిగా....తెలంగాణ స్టేట్ కు కేటాయిస్తున్నట్లు కమిటీ రిపోర్ట్ లో వెల్లడించింది. అయితే ఏపీకి చెందిన వ్యక్తులను తాము చేర్చుకోమని అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. దీంతో కొందరు తమ స్థానికత తప్పుగా పడిందని తాము తెలంగాణకు చెందిన వ్యక్తులమేనని చెప్పేందుకు కమిటీకు కొన్ని ఆధారాలను సమర్పించారు. మిగిలిన కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించడంతో డ్యూటీలోకి చేర్చుకుని జీతాలు ఇచ్చారు. కానీ రామ్మోహన్ రావు మాత్రం కమిటీకి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదనే ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా