Hyderabad Politics : గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్, గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్న నేతలు
Hyderabad Politics : గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరగా, ఆ బాటలోనే బొంతు రామ్మోహన్ నడుస్తున్నట్లు సమాచారం.
Hyderabad Politics : ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ... గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బలమైన పట్టు నిలుపుకుంది. అయితే మరి కొన్ని నెలలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల ముందు గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీకి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాటలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో రామ్మోహన్ తన అనుచరులతో కలిసి త్వరలోనే కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్దమైనట్లు సమాచారం. కాగా ఆయన సతీమణి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?
అయితే విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దీన్ లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చింది. అయితే ఆ తరువాత రెండో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఉద్యమకారులను చిన్నచూపు చూసిందని, అసలు తెలంగాణ ఉద్యమ లక్ష్యమే పక్కదారి పట్టించేందనే ఆరోపణలు వచ్చాయి. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి బంగపడ్డ బొంతు రామ్మోహన్... అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని పలు మార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా పార్టీ అధిష్ఠానం, అధినేత కేసీఆర్ తనను, తన సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానన్నారు. తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బాబా ఫసీయుద్దీన్ బాటలోనే నడిచి.....కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అర్థం అవుతుంది. ఇటు అధికార పార్టీ కూడా హైదరాబాద్ లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో సంప్రదింపులు జరుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్ కీలక నేత చక్రం తిప్పుతునట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీతో టచ్ లో 20 మంది కార్పొరేటర్లు
ఇదిలా ఉంటే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా కారు దిగుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్ లో శనివారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన కార్పొరేటర్ల సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం....కారు దిగుతారు అన్న ప్రచారానికి బలం చేకూరుస్తుంది. అంతే కాకుండా పార్టీలో కొందరి వల్ల తమకు అవమానకరంగా ఉందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తన భర్త శోభన్ రెడ్డి టికెట్ విషయంపై పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడం, కేసీఆర్ ను కలిసేందుకు వీలు లేకపోవడం వంటి కొన్ని అంశాల వల్ల ఆమె గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉంటున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరడం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవ్వడం ఆమె కాంగ్రెస్ లో చేరిక ఆలోచనలకు బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వీడిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంతగూటికి చేరుతారనే ప్రచారం సాగుతోంది. మరో వైపు గులాబీ నేతలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్....ఇటీవలే జరిగిన సమావేశంలో పార్టీ నుంచి పోతే పోనీ వారి కర్మ అని వ్యాఖ్యానించడంతో మరికొంత మంది కార్పొరేటర్లు కారు దిగేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం