CM Revanth Reddy : అడ్డగోలు ఖర్చులు వద్దు, ఉన్నది ఉన్నట్లుగా జనం ముందుకు-బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-hyderabad news in telugu cm revanth reddy review on state finance orders on actual budget ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : అడ్డగోలు ఖర్చులు వద్దు, ఉన్నది ఉన్నట్లుగా జనం ముందుకు-బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy : అడ్డగోలు ఖర్చులు వద్దు, ఉన్నది ఉన్నట్లుగా జనం ముందుకు-బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 27, 2023 08:59 PM IST

CM Revanth Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా ప్రజల ముందుంచుదామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవికత ప్రతిబింబించేలా అసలైన తెలంగాణ బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు.

ఉన్నటి ఉన్నట్లుగా జనం ముందుకు

అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు. తప్పనిసరైతే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.

22 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుపై

గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలవకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచిందని... సీఎం రేవంత్ రెడ్డి ఉదయం జరిగిన ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Whats_app_banner