CM Revanth Reddy : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే- సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy review on panchayat raj department solve drinking water problems ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు, గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jan 30, 2024 07:10 PM IST

CM Revanth Reddy : గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వచ్చే వేసవిలో రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించారు.

తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకే

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వారికే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ మాత్రమే విడిగా సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవటం లేదని సీఎం అన్నారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలో లేదని అధికారులు వివరణ ఇచ్చారు. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు.

వాస్తవాలు దాచిపెట్టొద్దు

వందకు వంద శాతం తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు వీలున్న జల జీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయని అన్నారు. అందుకే వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడెంలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందటం లేదని అన్నారు. ఎన్నికలప్పుడు తాను ఖానాపూర్ వెళితే తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు చాలా గ్రామాల ప్రజలు తన దృష్టికి తెచ్చిన విషయం గుర్తు చేశారు.

తాగు నీటి అవసరాలకు రూ.కోటి

రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజినీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యంగా అందించాలని స్పష్టం చేశారు.

స్వయం సహాయక సంఘాల బలోపేతం

రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్ లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు, హాబిటేషన్లకు రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించారు. వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి వీటిని పూర్తి చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.