Mega DSC : మూసివేసిన అన్ని పాఠశాలలను తిరిగి తెరవండి, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల భర్తీ- సీఎం రేవంత్ రెడ్డి
Mega DSC : రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Mega DSC : తెలంగాణలోని అన్ని పంచాయతీల్లో బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనన్నారు. ఏ ఒక్క బాలుడు, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దన్నారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తిరిగి తెరిపించాలన్నారు. ఎంత మంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని అని సీఎం ఆదేశించారు. దీని కోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలపై
ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సీఎం సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యంగల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలుండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజక వర్గంతో పాటు తొమ్మిది జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు గాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగిన ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు.
ప్రైవేట్ వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు
రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు.
సర్వ శిక్షా అభియాన్ నిధులపై విచారణ
ఇండ్ల ప్లాట్లకు రిజిస్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్టరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీ అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.