KTR : 32 మెడికల్ కాలేజీలుగా బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు, ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్ వైరల్!
KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ క్యాడర్ లో ఇంకా చర్చ జరుగుతోంది. తాజాగా కేటీఆర్ ట్వీట్ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.
KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను నమ్మిన ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. మూడోసారి అధికారంలోకి వస్తామని భావించిన బీఆర్ఎస్ కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాతీర్పుపై అప్పట్లో బీఆర్ఎస్ నేతలు భిన్నంగా స్పందించారు. త్వరలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం కూడా చెప్పారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఓ నెటిజన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్
"ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర అభిప్రాయాలు, పరిశీలనలు చూస్తున్నాను. వాటిల్లో ఇప్పటి వరకు ఇది అత్యుత్తమమైనది. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది. ఈ పరిశీలనతో కొంత వరకు ఏకీభవిస్తున్నాను"- అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాకొక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఆ మేరకు నిర్మాణాలు చేపట్టింది. అయితే దీనిపై ఓ నెటిజన్ భిన్నంగా స్పందిస్తూ గత ప్రభుత్వం 32 మెడికల్ కాలేజీలుగా బదులుగా 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉండేదని కామెంట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వివిధ విశ్లేషణలు చూశానన్నారు. అందులో ఇదొకటి, కొంత వరకు తాను ఈ వాదనను అంగీకరిస్తున్నట్టు కేటీఆర్ అన్నారు.
నెటిజన్ల స్పందన
కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. మీ ప్రచారానికి కారణాలను ఆపాదిస్తున్నంత కాలం, ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ఇది తెలియజేస్తుంది. కాబట్టి మీరు స్వీకరించే ఈ అభిప్రాయం బీఆర్ఎస్ మద్దతుదారుల నుంచి కావొచ్చని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
మరో నెటిజన్ స్పందిస్తూ... 'సీరియస్ గా రామన్న, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఆ పని చేసి ఉండాల్సింది. యూట్యూబ్ ఛానెల్‌ల ప్రచారం బీఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీసింది" అని ట్వీట్ చేశారు.
అయితే యూట్యూబ్ ఛానల్స్ ప్రజాతీర్పును నిర్దేశిస్తాయా? అంటే మాత్రం కాదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు నేతల ప్రవర్తన, కాంగ్రెస్ హామీలు ఎన్నికల్లో ప్రభావం చూపాయంటున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కంటే ఎక్కువగానే బీఆర్ఎస్ డిజిటల్ ప్రచారం చేసిందని అంటున్నారు.