Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం-hyderabad news in telugu aicc announced revanth reddy as chief minister to telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad News In Telugu Aicc Announced Revanth Reddy As Chief Minister To Telangana

Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం

Bandaru Satyaprasad HT Telugu
Dec 05, 2023 06:43 PM IST

Revanth Reddy : తెలంగాణ నూతన సీఎం ఉత్కంఠకు తెరపడింది. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం రేవంత్‌ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. . భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ లో ఎప్పుడూ వన్ మ్యాన్ షో ఉండదని, అందరూ ఒక టీమ్ ముందుకు సాగుతామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

దిల్లీ బయలుదేరిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిల్లీ బయల్దేరి వెళ్లారు. ఎల్లుండి రాజ్ భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన నివాసం వద్ద భద్రత పెంచారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ప్రస్థానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మారు మోగుతున్న ఒకే ఒక పేరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక క్రౌడ్ పుల్లర్, ఆయన మాటలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే కోట్ల మంది ప్రజాదరణ పొంది అగ్ర స్థాయికి ఎదిగారు. ముళ్లబాట నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎలా ఎదిగారో ఓసారి చూద్దాం.

అనుముల నర్సింహారెడ్డి,రామ చంద్రమ్మ దంపతులకు నవంబర్ 8,1969 న అనుముల రేవంత్ రెడ్డి జన్మించారు. రేవంత్ రెడ్డి స్వస్థలం కొండ రెడ్డి పల్లి గ్రామం, వంగురు మండలం,నాగర్ కర్నూల్ జిల్లా.రేవంత్ రెడ్డి ఏవీ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఆయనకు భార్య గీతా రెడ్డి, కుమార్తె నైమిష రెడ్డి ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

• 2007 జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలను మట్టికరిపించి ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తొలి విజయంతోనే అందరి చూపునూ తన వైపు తిప్పుకున్నారు.

• ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించినా.....రేవంత్ రెడ్డి సున్నితంగా ఆహ్వానాన్ని తిరస్కరించి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరారు.

• 2009లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు.

• ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి, 2017 వరకు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా కొనసాగి సభలో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు.

• 2017 అక్టోబర్ నెలలో టీడీపీకి రాజీనామ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం మూడేళ్ల పాటు ప్రజా సమస్య లే అజెండాగా ముందుకు సాగారు.

• రేవంత్ ప్రతిభను, జనంలో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం... ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.

• 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన......ఆ తరువాత వచ్చిన పార్లిమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు.

• జూన్ 26,2021 న కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించింది. 2021 జూలై 7న నాటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాకూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు.

• కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి దక్కిందని కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్న అధిష్ఠానం సహకారంతో నేతలందరినీ ఒకతాటిపైకి తెచ్చారు.

• ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని ప్రచారం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస 64 స్థానాలను దక్కించుకొని విజయపతాక ఎగరవేసింది.

• తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడానికి ముఖ్య కారకుడిగా నిలిచిన రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

WhatsApp channel