Hyderabad New Year Restrictions : న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ మహా నగరం సిద్ధమవుతోంది. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న తేదీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్ లోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఓఆర్ఆర్ పై భారీ వాహనాలు, ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారన్నారు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఫ్లై ఓవర్ల మూసివేతతో పలు మార్గాలలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, వాహనదారులు గమనించాల్సి ఉంటుంది.
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత న్యూ ఇయర్ పేరుతో కేసుల్లో చిక్కుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్ వీలర్స్ సంఘం వెల్లడించింది.
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక ప్రకటన చేసింది. న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ అర్ధరాత్రి 12: 30 గంటలకు వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 31న వేడులకు జరుపుకొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుందని నిర్వాహకులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని మెట్రో రైళ్లను నడపున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం