Hyderabad Crime : పెళ్లికి నిరాకరించిందని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై ఫుడ్ డెలివరీ బాయ్ కత్తితో దాడి!
Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
Hyderabad Crime : తెలంగాణ రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి మెడ, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. దీంతోఆమెను పోలీసులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించందనే కోపంతో ఓ యువకుడు యువతి గొంతు కోశాడు. పుప్పాలగూడ టీ గ్రిల్ హోటల్ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతి (22) హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. యువతి గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. యువతి సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన గణేష్ (27) గచ్చిబౌలిలో జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు గణేష్.. గతంలో ప్రతిపాదించాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు...మంగళవారం రాత్రి హాస్టల్‌లో ఉన్న యువతికి ఫోన్ చేసి హోటల్ కు వెళ్తామని చెప్పి... బైక్‌పై టీ గ్రిల్ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి గణేష్ పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చింది. అయితే గణేష్ ప్రతిపాదనకు యువతి మళ్లీ తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గణేష్ తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి యువతిపై దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతు, ముఖం, చేతులపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి... నార్సింగి పోలీసులకు అప్పగించారు. తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేష్ దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
జంట హత్యలు
హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జంట హత్యలు కలకలం రేపాయి. టపాచబుత్ర పీఎస్ పరిధిలో ఇద్దరు హిజ్రాలను దుండగులు దారుణంగా హతమార్చారు. మృతులు దైబాగ్ ప్రాంతానికి చెందిన యూసఫ్ అలియాస్ డాలీ, రియాజ్ అలియాస్ సోఫియాగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పోడిచి, రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ హత్యలు వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా ఇద్దరినీ ఒకే విధంగా బండరాయితో కొట్టి హతమార్చారు. ఒకే రాత్రి రెండు జంట హత్యలు చోటు చేసుకోవడం స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. హత్యోదంతాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టపాచబుత్ర ఘటనకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు. ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మండల డీసీపీ కిరణ్ పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.