Public Murders : నడిరోడ్డుపై దారుణ హత్య… వీడియోలు తీస్తూ చోద్యం చూసిన జనం….
Public Murder మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హతమారుస్తున్నా, చుట్టూ ఉన్న జనం చోద్యం చూస్తూ వీడియోలు రికార్డ్ చేశారే తప్ప ఏ మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ మార్గంలో వస్తున్న కానిస్టేబుల్ కేకలు వేయడంతో నిందితులు పరారైనా అప్పటికే ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాతబస్తీ జియాగూడలో ఈ దారుణం జరిగింది.
Public Murder హైదరాబాద్ జియాగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ముగ్గురు ఆగంతుకులు దాడి చేసి ఓ వ్యక్తిని హతమార్చారు.అందరూ చూస్తుండగానే కత్తులతో వెంటాడి పొడిచి చంపారు. ఈ ఘటన చూసి స్థానికులు భయాందోళనలకు గురైనా ఒక్కరు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అదే మార్గంలో వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కేకలు వేయడంతో నిందితులు గమనించి పారిపోయారు.
హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో ఆదివారం ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని జంగం సాయినాథ్‌గా గుర్తించారు. అంబర్‌పేట బతుకమ్మ కుంటలో నివసించే సాయినాథ్ కార్పెంటర్ పనిచేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం ఒంటరిగా ద్విచక్ర వాహనంపై పురానాపూల్ వైపు నుంచి జియాగూడ మేకలమండీ మార్గంలో వెళ్తుండగా ప్రత్యర్థులు దాడి చేశారు. పీలిమండవ్ శివాలయం సమీపంలో ముగ్గురు ఆగంతుకులు బైక్‌కు అడ్డుగా వచ్చి ఇనుపరాడ్‌తో సాయినాథ్ తల వెనక బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. కొడవలి, కత్తి, ఇనుపరాడ్‌తో అతనిపై దాడి చేశారు.
నడిరోడ్డుపై దాడి చేస్తుండగా బాధితుడు సాయం కోసం కేకలు వేశాడు. ప్రాణాలు కాపాడుకోడానికి రోడ్డు వెంబడి పరుగెత్తాడు. నిందితులు వదలకుండా వెంటపడి వేటాడారు. కత్తితో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో నరికారు. పురానాపూల్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న గోషామహల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ జనార్దన్ దాడిని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘటనాస్థలానికి వస్తుండగానే.. నిందితులు మూసీ నదిలోకి వెళ్లే మెట్లమార్గం నుంచి దూకి పారిపోయారు.
రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని కాపాడేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించినా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందజేశాడు. కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధం కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హతుడి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హత్యకు గురైన సాయినాథ్ కుటుంబ బాధ్యతలు ఉండటంతో వివాహం చేసుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తండ్రికి పక్షవాతం, విడాకులు తీసుకున్న అక్కతో పాటు వారి పిల్లల బాధ్యతలు ఉండటంతో పెళ్లి చేసుకోలేదని విలపించారు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని చంపేయడంతో తమకు దిక్కెవరని కుటుంబ సభ్యులు విలపించారు.
టాపిక్