MP Komatireddy On Sharmila : షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తాం, ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
MP Komatireddy On Sharmila : వైఎస్ షర్మిలను పార్టీలోకి చేర్చుకోవాలనేది తన అభిప్రాయం అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే లాభమే అన్నారు.
MP Komatireddy On Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. పార్టీకి నాలుగు ఓట్లు వచ్చినా 400 ఓట్లు వచ్చినా అందర్నీ కలుపుకొనిపోతామన్నారు. షర్మిలను పార్టీలో చేర్చుకోవాలనేది తన అభిప్రాయం అని చెప్పారు. వైఎస్ఆర్ పథకాలు అందిన పేదవాళ్లంతా షర్మిలను కాంగ్రెస్ చేరాలని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ తన పార్టీకి ఆంధ్రాలో పెట్టుకోలేదా?, మేం షర్మిలను చేర్చుకుంటే తప్పేంటి? అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
ట్రెండింగ్ వార్తలు
షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే లాభమే
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ విలీనం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య వైఎస్ షర్మిల శుక్రవారం దిల్లీలో పర్యటించి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతుందని చెప్పారు. షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ నిరవధిక వాయిదా పడడంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో వైఎస్ షర్మిల కూడా ఆయన వెంట ఉన్నారు.
విలీనంపై షర్మిల మౌనం
షర్మిల తెలంగాణలో పోటీ చేస్తే తప్పేంటని ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ ఆంధ్రా, మహారాష్ట్రకు వెళ్లారు కదా అన్నారు. వైఎస్సార్ కూతురిగా ఆమెకు కాంగ్రెస్‌లోకి ఆహ్వానం ఉంటుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే లాభమే జరుగుతుందన్నారు. మరోవైపు పార్టీ విలీనంపై షర్మిల మౌనం పాటిస్తున్నారు. దిల్లీ పర్యటన ముగించుకుని ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డితో పాటు ఉన్న ఆమెను మీడియా ప్రశ్నించగా, ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు.
షర్మిలకు కీలక బాధ్యతలు
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం షర్మిల సేవలను ఏపీలోనూ వాడుకోవాలని భావిస్తోంది. సోనియా గాంధీతో భేటీ అనంతరం విలీనం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. షర్మిల పార్టీ విలీనానికి దాదాపుగా అన్ని చర్చలు పూర్తై, ఇంక అధికారిక నిర్ణయం ఒకటే ఉందని కొందరు నేతలు అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారం మొత్తం నడిపారు. షర్మిల, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య మధ్యవర్తిత్వం వహించిన శివకుమార్... షర్మిల కోరుకున్నట్లుగా తెలంగాణ నుంచి పోటీకి అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ కోరుతున్నట్లుగా షర్మిలను ఏపీలోనూ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందుకు షర్మిల అంగీకరించారని తెలుస్తోంది.