T-Fiber Internet : ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం, టీఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు-hyderabad minister sridhar babu started t fiber internet services along with meeseva app ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T-fiber Internet : ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం, టీఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

T-Fiber Internet : ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం, టీఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Bandaru Satyaprasad HT Telugu
Dec 08, 2024 02:46 PM IST

T-Fiber Internet : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం టీఫైబర్ సేవలను ప్రారంభించింది. తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ వినియోగించవచ్చు.

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం, టీఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం, టీఫైబర్ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ వినియోగించవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. దీంతోపాటు మీసేవ మొబైల్‌ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ యాప్ లో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు రుణమాఫీ, బోనస్‌ కోసం యాప్ ప్రారంభించినట్లు తెలిపారు.

yearly horoscope entry point

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో టీ ఫైబర్ సేవలను ఇవాళ ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించనున్నట్లు తెలుస్తోంది. దశల వారీగా ఇంటర్నెట్ సేవలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ వైఫై కనెక్షన్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఈ కనెక్షన్‌ తీసుకుంటే టీవీతో పాటు ఫోన్, ఓటీటీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. టీఫైబర్ తొలిదశంలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 గ్రామ పంచాయతీల్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర గ్రామాలకు విస్తరించనున్నారు.

రూ.300 లకే ఇంటర్నెట్ సేవలు!

దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరిట ఓ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.2,500 కోట్లు అందించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీ ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీఫైబర్ ద్వారా కేవలం రూ. 300 లకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. రేట్లపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే టీవీని కంప్యూటర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

30 వేల ప్రభుత్వ సంస్థల అనుసంధానం

20 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సైతం ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. గ్రామాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ తో అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సీసీకెమెరాలను వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ లోని కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడమే టీ ఫైబర్‌ లక్ష్యమని ఆ సంస్థ ఎండీ వేణు ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో టీఫైబర్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా 30 వేల ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వేణు ప్రసాద్ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం