Young Farmers : లండన్ లో ఉద్యోగం వదిలేసి అవకాడో సాగు, ఎంటెక్ చదివి బొప్పాయి పంట- అద్భుతాలు సృష్టిస్తున్న యువ రైతులు
Young Farmers : ఒకరు ఎంటెక్ చేసి బొప్పాయి సాగు, లండన్ లో ఉద్యోగం వదిలేసి అవకాడో పంట పండిస్తున్న మరో యువకుడు, యూట్యూబ్ లో వ్యవసాయ విజయాలు ప్రపంచానికి తెలియజేస్తు్న్నాడు ఇంకో యువకుడు. ఈ ముగ్గురు యువ రైతులను మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు.
Young Farmers :ఎంటెక్ చేసి బొప్పాయి సాగు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు. లండన్ లో ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తున్నారు మరో యువకుడు. వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు మరో యువకుడు. ఈ ముగ్గురు యువరైతులు వ్యవసాయంలో కొత్త ఒరవడిని సృష్టించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ముగ్గురును మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్...10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్నారు. మొజాయిక్ వైరస్ కారణంగా బొప్పాయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో... దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఆదీప్ అహ్మద్. సివిల్ ఇంజినీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివిన కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్ ..అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. లండన్ లో ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్నారు. ఎకరాకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు లాభాలు వస్తున్నాయని జైపాల్ తెలిపారు.
యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి
కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్... యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా రైతుల విజయాలను ప్రచారం చేస్తున్నారు. ఈ ముగ్గురు యువ రైతులు మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. వీరిని మంత్రి అభినందించారు. మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం అన్నారు. వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి అన్న మంత్రి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలని, మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలన్నారు. సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలని కోరారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలన్నారు. దానికి మీరు పునాదిరాళ్లు .. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలని యువ రైతులను మంత్రి కోరారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువరైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్ , యూ ట్యూబర్ శివకుమార్ లను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద పాల్గొన్నారు.