KTR On Karnataka Results : కేరళ స్టోరీకి కర్ణాటక ఫలితాలకు లింక్ పెట్టిన కేటీఆర్, విద్వేషాన్ని తిరస్కరించారని ట్వీట్-hyderabad minister ktr tweet to congratulates congress winning in karnataka election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Minister Ktr Tweet To Congratulates Congress Winning In Karnataka Election

KTR On Karnataka Results : కేరళ స్టోరీకి కర్ణాటక ఫలితాలకు లింక్ పెట్టిన కేటీఆర్, విద్వేషాన్ని తిరస్కరించారని ట్వీట్

Bandaru Satyaprasad HT Telugu
May 13, 2023 05:54 PM IST

KTR On Karnataka Results : కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. దేశ భవిష్యత్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడాలని ఆకాంక్షించారు.

కేటీఆర్
కేటీఆర్ (Twitter )

KTR On Karnataka Results : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ 135 సీట్లు సాధించింది. హస్తం పార్టీ విజయం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు స్పందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్... ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేర‌ళ స్టోరీ సినిమా కర్ణాట‌క ప్రజ‌ల్ని ఆక‌ర్షించ‌డంలో విఫ‌లం అయ్యింద‌ని, అలాగే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలంగాణ‌పై ఎటువంటి ప్రభావం ఉండదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నీచ‌మైన‌, విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌ను తిర‌స్కరించిన క‌ర్ణాట‌క ప్రజ‌ల‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం పెట్టుబడులు ఆక‌ర్షించ‌డంలో మౌలిక‌ స‌దుపాయాల్ని క్రియేట్ చేయ‌డంలో హైద‌రాబాద్‌, బెంగుళూరు ఆరోగ్యక‌ర‌ంగా పోటీప‌డాల‌ని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు రిపీట్ - రేవంత్ రెడ్డి

కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నాంపల్లి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కుట్రలు, కుతంత్రాలతో జేడీఎస్‌ను గెలిపించి, హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను ప్లాన్ చేశారని, ఆ ప్రయత్నాన్ని కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ భావించారన్నారు. కుమారస్వామి కర్ణాటకకు సీఎం కావాలంటే.. కర్ణాటక ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడాలని, హంగ్‌ ఏర్పడినప్పుడే జేడీఎస్‌ పాత్ర అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకమవుతుందని రేవంత్‌ పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే

కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంపై గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి , ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే , ఏఐసీసీ సెక్రెటరీలు, ఇతర నేతలు సంబరాలు చేసుకున్నారు. కోలార్ సభలో రాహుల్ మాట్లాడిన దానిపై రాహుల్‌ గాంధీపై వేటు వేయడం, ఇల్లు ఖాళీ చేయించడం కర్ణాటక ప్రజలకు నచ్చలేదన్నారు. అదానీ అవినీతిపై మాట్లాడితే రాహుల్‌ గాంధీపై కక్ష సాధించారని రేవంత్ ఆరోపించారు. గులాంనబీ అజాద్ ఎంపీ పదవి కాలం పూర్తి అయిందని, అయినా ఆయన ఇల్లు ఎందుకు ఖాళీ చేయించలేదని ప్రశ్నించారు. అదానీతో సంబంధం లేదంటూనే అదానీని విమర్శిస్తే బీజేపీ ఉలిక్కిపడుతుందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే బీఆర్ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలవకుండా చేయాలని ప్రయత్నించిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల ఆలోచనలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయన్నారు.

IPL_Entry_Point