KTR On Wrestlers Protest : దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా?, జంతర్ మంతర్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం-hyderabad minister ktr supports wresters protest criticizes union govt responsible for things ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Minister Ktr Supports Wresters Protest Criticizes Union Govt Responsible For Things

KTR On Wrestlers Protest : దేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా?, జంతర్ మంతర్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

Bandaru Satyaprasad HT Telugu
May 29, 2023 02:34 PM IST

KTR On Wrestlers Protest : దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆందోళన చేస్తున్న రెజ్లర్లు పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన రెజ్లర్లకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు
రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మద్దతు

KTR On Wrestlers Protest : దిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రెజ్లర్లకు మంత్రి కేటీఆర్ మ‌ద్దతు తెలిపారు. రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ తప్పుబట్టారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై భారతదేశ ఖ్యాతిని చాటిన రెజ్లర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గౌర‌వం ఇదేనా? అని కేటీఆర్ మండిపడ్డారు. రెజ్లర్లకు దేశ ప్రజ‌లు మ‌ద్దతుగా నిల‌వాలని కోరారు. రెజ్లర్లకు గౌర‌వం ఇవ్వాల‌ని కేటీఆర్ కోరారు. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నెల రోజులకు పైగా రెజ్లర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం దిల్లీ పోలీసులు, ప్రత్యేక బలగాలు రెజ్లర్లపై విరుచుకుపడ్డారు. అత్యంత దారుణంగా ప్రవర్తించి వారిని అరెస్టు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

జంతర్ మంతర్ రణరంగం

తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడంలేదు. ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద మహిళా సమ్మాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. ర్యాలీగా రెజ్లర్లు కొత్త పార్లమెంట్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు... సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియాతో పాటు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. రెజ్లర్లపై కేసులు నమోదు చేశారు. అయితే నిందితుడు బ్రిజ్ భూషణ్ ను ప్రభుత్వం రక్షిస్తుందని వినేశ్‌ ఫొగట్‌ ఆరోపించారు.

స్పందించని కేంద్ర ప్రభుత్వం

పార్లమెంటు కొత్త భవనానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజర్లను దిల్లీ పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ లాంటి పతకాలను సాధించిన రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‍ను బలవంతంగా పోలీసులు వాహనాల్లోకి ఎక్కించారు. ర్యాలీ చేసేందుకు పోలీసులను ప్రతిఘటించిన రెజర్లను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మరికొందరు రెజర్లను కూడా పోలీసులు నిర్భందించి వేరే ప్రాంతానికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల ఆందోళన శిబిరాన్ని ఖాళీచేశారు. బీజేపీ ఎంపీగా ఉన్న డబ్ల్యూఎఫ్‍ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని జనవరిలో రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. అయితే అతడిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి హామీ లభించటంతో ఆందోళన విరమించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ఏప్రిల్ 23న జంతర్ మంతర్ వద్ద మరోసారి ఆందోళనకు దిగారు రెజ్లర్లు. అప్పటి నుంచి నిరసనను కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్‍ను అరెస్ట్ చేసే వరకు ఉద్యమం ఆపబోమని రెజ్లర్లు స్పష్టం చేస్తున్నారు. రెజర్లకు పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు మద్దతుతెలిపాయి.

IPL_Entry_Point