KTR On Chandrababu Arrest : ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్
KTR On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు ఏపీకి సంబంధించిన వ్యవహారమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏపీ సమస్యపై ఇక్కడ ర్యాలీ చేస్తామంటే సరికాదన్నారు.
KTR On Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య అన్నారు. ఏపీలో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణ సంబంధం లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. హైదరాబాద్ లో ఆందోళనలకు అనుమతిపై లోకేశ్ ఫోన్ చేశారని, శాంతి భద్రతల కారణంగా అనుమతి ఇవ్వలేమని చెప్పాన్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో ఆందోళనలు వద్దని సూచించారు. ఐటీ ఉద్యోగులు రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దని సూచించారు. ర్యాలీలు, ఆందోళనలు చేసి హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
ట్రెండింగ్ వార్తలు
బీఆర్ఎస్ తటస్థం
చంద్రబాబు అరెస్టు ఏపీలో రాజకీయ వ్యవహారమని మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్టు తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఏపీలో అరెస్టు అయ్యారని అక్కడ ర్యాలీలు, ధర్నాలు చేసుకోవాలన్నారు. అక్కడ చేయకుండా తెలంగాణణలో రాజకీయ రాద్ధాంతం చేస్తానంటే సరికాదన్నారు. పక్క రాష్ట్రం పంచాయితీలు ఇక్కడ తేల్చుకుంటారా? అని ప్రశ్నించారు. విజయవాడ, అమరావతి, రాజమండ్రిలో ర్యాలీలు చేసుకోవాలన్నారు. ఏపీ సమస్యపై హైదరాబాద్‌లో కొట్లాడతా అంటే ఎలా? అన్నారు. టీడీపీ, వైసీపీలకు హైదరాబాద్ లో ఉనికిలేదని, ఇక్కడ శాంతిభద్రతల సమస్య వస్తే ఎలా? అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థం అన్నారు.
ఏపీ రాజకీయాల్లో తలదూర్చం
చంద్రబాబుకు కోర్టులో ఏం న్యాయం జరుగుతుందో అది జరుగుతోందని కేటీఆర్ అన్నారు. విషయం కోర్టుల్లో ఉండగా బయటకు వాటిపై కామెంట్ చేయకూడదన్నారు. తనకు లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్, అందరూ మంచి స్నేహితులే అన్నారు. తనకు ఏపీలో తగాదాలు లేవని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. లోకేశ్ ఫోన్ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగారని, శాంతి భద్రతల కారణంగా ర్యాలీలకు అనుమతి ఇవ్వలేమని చెప్పానన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదని తెలిపారు. ఒక రాజకీయ పార్టీగా ఈ అంశంపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టుపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతమని, దానికి పార్టీకి ఏం సంబంధం లేదని తెలిపారు. ఏపీ రాజకీయాలలో తాము తల దూర్చలేమని మంత్రి కేటీఆర్ తెలిపారు.