Medchal Shamirpet Metro : హైదరాబాద్ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- మేడ్చల్, శామీర్ పేట్ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
Medchal Shamirpet Metro : మేడ్చల్, శామీర్ పేట్ మెట్రో పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్యారడైజ్-మేడ్చల్ (23 కి.మీ),జేపీఎస్-శామీర్ పేట్(22 కి.మీ) మెట్రో కారిడార్లకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ రెండు కారిడార్లకు డీపీఎస్ సిద్ధం చేయాలని ఆదేశించింది.
Medchal Shamirpet Metro : హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మేడ్చల్, శామీర్ పేట్ కు మెట్రో సేవలు పొడిగింపుపై కీలక ప్రకటన చేసింది. ప్యారడైజ్ నుంచి తాడ్ బండ్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ (23 కి.మీ), జేబీఎస్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్ పేట్ (22 కి.మీ) వరకు రెండు కొత్త కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటికి వెంటనే డీపీఆర్ లు సిద్ధం చేసి, కేంద్రం అనుమతికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్‌ఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్లు ఈ కారిడార్ ఉంటుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడి ట్రాఫిక్ సమస్యపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్‌లపై తనకు అవగాహన ఉందని సీఎం అన్నారు. రూట్ మ్యాప్ విషయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వివరించి ఆయన సూచనలు తీసుకోవాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సీఎం ఆదేశించారు.
కొత్త కారిడార్లకు డీపీఆర్ ను 3 నెలల్లో సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఎండీకి సూచించారు. మెట్రో ఫేజ్-2 ఏ భాగం మాదిరిగానే బి భాగాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వెంటనే డీపీఆర్, ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేయనున్నట్లు మెట్రో ఎండీ అన్నారు.
జనవరిలో మెట్రో ఫేజ్ 2- ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ప్రారంభం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్ 2 జనవరిలో ప్రారంభం కానుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవల తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్.. ఓల్డ్ సిటీకి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కనెక్టివిటీ అవసరాలను తీర్చడానికి సిద్ధమవుతోందన్నారు. మొత్తం 76.4 కిలోమీటర్ల మేర ఐదు మెట్రో కారిడార్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా, ఓల్డ్ సిటీ కారిడార్‌లో పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను ప్రకటించిందన్నారు.
ఓల్డ్ సిటీ కారిడార్ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు, వాస్తవానికి మెట్రో మొదటి దశలో భాగంగా ప్లాన్ చేసినా వివిధ సవాళ్ల కారణంగా ఆలస్యమైందని ఎండీ తెలిపారు. ఇప్పుడు దీనిని చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నామన్నారు. డిసెంబర్ చివరి వారంలో భూసేకరణ చట్టం కింద సేకరించిన ఆస్తుల కూల్చివేతతో... జనవరి మొదటి వారంలో నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మెట్రో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ కారిడార్ ఆరు మెట్రో స్టేషన్లను కలిగి ఉంటుందని, రెండో దశలో 54 స్టేషన్లలో ఇది ముఖ్యమైన భాగం అన్నారు. రెండోదశ పనులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం