Hyd Accident: ట్రాఫిక్ పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడి మృతి-hyderabad man flees routine traffic check dies after skidding ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Accident: ట్రాఫిక్ పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడి మృతి

Hyd Accident: ట్రాఫిక్ పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడి మృతి

Sarath Chandra.B HT Telugu

Hyd Accident: ట్రాఫిక్‌ పోలీసుల్ని తప్పించుకనే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌ బాలనగర్‌ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనతో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తనిఖీలను తప్పించుకునే ప్రయత్నంలో యువకుడి మృతి (Representative Image/Shutterstock)

Hyd Accident: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసుల్ని తప్పించుకునే క్రమంలో ఓ యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలను తప్పించుకోడానికి యువకుడు బైక్‌ను పక్కకు తిప్పడంతో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వల్ల యువకుడు మృతి చెందాడంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌ బాలానగర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వడ్రంగి కార్మికుడు జోషి ట్రాఫిక్ పోలీసుల తనిఖీలను తప్పించుకనే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. తని మీదుగా బస్సు దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన తరువాత, స్థానికులు ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు కానిస్టేబుల్ మద్యం సేవించాడని కూడా ఆరోపించారు.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, బైక్‌ నడిపిన యువకుడు స్వయంగా జారిపడినట్లు తేలిందని వివరించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు చేయడంతో బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్లోని ఐడీపీఎల్ కాలనీ గేటు వద్ద ఆదివారం మధ్యాహ్నం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపట్టారు. షాపూర్ నగర్‌ రొడా మేస్త్రీ నగర్‌కు చెందిన జోషిబాబు ద్విచక్ర వాహనాన్ని కానిస్టేబుల్ ఆపాడు. వాహనం ఆపినట్టు స్లో చేసి వెంటనే కుడివైపు వేగంగా పోనిచ్చాడు.

అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మెదక్ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌ మీద ఉన్న జోషిబాబు వెనుక చక్రాల కింద పడ్డాడు. తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కాపట్టుకొని లాగడంతోనే బస్సు చక్రాల కింద పడి జోషిబాబు చనిపోయాడని వాహనదారులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానిస్టేబుల్‌ను దూషించడంతో పాటు రోడ్డుపై బైఠాయించడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది.

పోలీసులతో స్థానికులు తోపులాటకు దిగడంతో లాఠీఛార్జి జరపాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుళ్లను కొట్టేందుకు ఆందోళనకారులు యత్నించారు. మృతుడి బంధువులు, ఆందోళనకారులకు పోలీసు అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ చూపించి.. ఆందోళన విరమింపజేశారు. జోషిబాబుకు భార్య, ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం