Love Marriage Sad End : ప్రేమ పెళ్లిళ్లు విషాదాంతం, ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య!-hyderabad love marriages end sad two couple committed suicide family problems ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Love Marriage Sad End : ప్రేమ పెళ్లిళ్లు విషాదాంతం, ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య!

Love Marriage Sad End : ప్రేమ పెళ్లిళ్లు విషాదాంతం, ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య!

HT Telugu Desk HT Telugu
Jun 09, 2024 05:29 PM IST

Love Marriage Sad End : ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ జంటల కథ విషాదాంతం అయ్యింది. ఒక జంట మూడేళ్ల క్రితం, మరొ జంట ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతలో మనస్పర్థలు, గొడవలతో చివరికి ప్రాణాలు తీసుకున్నారు.

ప్రేమ పెళ్లిళ్లు విషాదాంతం, ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య!
ప్రేమ పెళ్లిళ్లు విషాదాంతం, ఒకే రోజు రెండు జంటలు ఆత్మహత్య!

Love Marriage Sad End : వారిద్దరూ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏమైందో తెలియదు. పట్టుమని పాతికేళ్లు పూర్తిగా నిండకముందే ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరూ ఉరేసుకొని బలవన్మరణం చెందారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....జీడిమెట్లలోని హెచ్ఎమ్ఎల్ నగర్ ప్రాంతానికి చెందిన మంచూరి రిశ్వంత్ (26)కు అదే ప్రాంతానికి చెందిన సాయి శ్రేయ (22)తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత వీరు గాజుల రామరాం ద్వారక నగర్ లో కాపురం పెట్టారు. రేశ్వంత్ బిగ్ బాస్కెట్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తుండగా... సాయి శ్రేయ ఇంట్లోనే ఉంటుంది. కొన్ని రోజుల వరకు వీరి కాపురం సజావుగానే సాగినా ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి.

గొడవల విషయం ఇద్దరి తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు వారి కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చజెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఉన్నఫళంగా ఏం జరిగిందో తెలియదు శనివారం సాయంత్రం సాయి శ్రేయ తన తల్లి గారింట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆమె భర్త రేశ్వంత్ జీడిమెట్ల లోని హెచ్ఏమ్టీ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయి శ్రేయ గత కొన్ని రోజులుగా తీవ్రంగా డిప్రెషన్ తో బాధపడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు సైతం గత కొన్ని రోజులుగా సాయి శ్రియ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పారు. ఇక భార్య మృతి జీర్ణించుకోలేక భర్త రేశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకే రోజు ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పొలంలో ఉరేసుకొని భార్యాభర్తలు ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లా బాల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... జూనుకుంట గ్రామానికి చెందిన మహేష్, అదే ప్రాంతానికి చెందిన భానుమతి గత ఏడాది కాలంలో ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ప్రేమ వివాహం సైతం చేసుకున్నారు. అయితే భానుమతి మైనర్ కావడంతో మహేష్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. దీంతో అతడు కొన్ని రోజులు జైలుకి వెళ్లివచ్చాడు. వచ్చిన తరువాత కొన్ని నెలల వరకు బాగానే ఉన్నా...ఉన్నఫళంగా ఏం జరిగిందో తెలియదు. శనివారం రాత్రి తమ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న చెట్టుకు ఇద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. దీంతో ఇద్దరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner