Hyderabad Crime : భార్య,కూతురిని కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం ఎల్బీ నగర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. శిక్షతో పాటు పదివేల జరిమానా కూడా విధించింది. అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామం అంగడి బజార్ కు చెందిన రోజా (25) వృత్తి రీత్యా కూలీ. అదే గ్రామానికి చెందిన రాజును (35) ఐదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి నాలుగేళ్ల శ్రావణ్ ,రెండేళ్ల కీర్తన ఉన్నారు. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగినా ఆ తరువాత రాజు తన భార్య రోజాను వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు భౌతికంగా కూడా ఆమెపై దాడి చేశాడు. ఎప్పటిలాగానే 2019 ఫిబ్రవరి 14 న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజు ఇంటికి వచ్చి భార్య రోజాతో ఘర్షణకు దిగాడు. అప్పటికే అతని వేధింపులు మితిమీరి పోవడంతో ఇలాగే రోజు గొడవ పడితే తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్య రోజా బెదిరించింది.
దాంతో రెచ్చిపోయిన రాజు నువ్వేంటి ఆత్మహత్య చేసకునేది, నేనే నిన్ను చంపేస్తానంటూ భార్య రోజా, కూతురు కీర్తనపై కిరోసిన్ పోసి నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడు. మంటలు భరించలేక తల్లి కూతుర్లు కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగు వారు చేరుకొని మంటలను ఆర్పి వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతూ కూతురు కీర్తన మరుసటి రోజు మరణించగా భార్య రోజా మూడు రోజుల తరువాత మరణించింది. కాగా రోజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకుని సీఆర్పీసీ 162 ప్రకారం ఐపీసీ సెక్షన్ 498 ఎ,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే చికిత్స పొందుతూ తల్లి కూతురులిద్దరూ మరణించడంతో ఐపీసీ 302,307,498 ఎ సెక్షన్లుగా మార్చారు.
అనంతరం ఇన్స్పెక్టర్ గురవయ్య ఈ కేసు విచారణను చేపట్టారు. ఈ క్రమంలోనే 2019 ఫిబ్రవరి 18న నిందితుడైన రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి రాజుకు యావజ్జీవ జైలు శిక్ష, అలాగే పది వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. నిందితుడు రాజుకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న ఇన్స్పెక్టర్ గురువయ్య, కోర్టు డ్యూటీ ఆఫీసర్ రాము, రఘు కానిస్టేబుల్ కృష్ణంరాజు, హెడ్ కానిస్టేబుల్ జానలయ్యాను సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్