KTR : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా కూడా అవినీతి జరగలేదు, ఏ విచారణకైనా వస్తా - కేటీఆర్-hyderabad ktr responded on formula e case high court verdict on quash petition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా కూడా అవినీతి జరగలేదు, ఏ విచారణకైనా వస్తా - కేటీఆర్

KTR : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా కూడా అవినీతి జరగలేదు, ఏ విచారణకైనా వస్తా - కేటీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Jan 07, 2025 09:12 PM IST

KTR : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా అవినీతి కూడా జరగలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణ లాయ‌ర్ల స‌మ‌క్షంలో జ‌ర‌పాల‌ని హైకోర్టును ఆశ్రయిస్తాన‌ని అన్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేతను సుప్రీంకోర్టులో సవాల్ చేశానన్నారు.

ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా కూడా అవినీతి జరగలేదు, ఏ విచారణకైనా వస్తా - కేటీఆర్
ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా కూడా అవినీతి జరగలేదు, ఏ విచారణకైనా వస్తా - కేటీఆర్

KTR : ఫార్ములా-ఈ రేస్ లో అర పైసా అవినీతి కూడా జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాత్రి నందినగర్ లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టివేయగానే...కొందరు కాంగ్రెస్ మంత్రులు ఏదో జరిగిపోయినట్లు ఇప్పుడే తీర్పులు ఇచ్చేస్తున్నారన్నారు. ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగవని సెటైర్లు వేశారు. ఏసీబీ అధికారులు లాయ‌ర్ల స‌మ‌క్షంలో విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టును ఆశ్రయిస్తాన‌ని కేటీఆర్ అన్నారు. రేపు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి, చ‌ట్టప‌ర‌మైన రక్షణ క‌ల్పించాల‌ని కోరతానన్నారు.

yearly horoscope entry point

"ఇవాళ పొద్దుట్నుంచి ఏదో జరిగిపోతున్నట్లు కాంగ్రెస్ నాయ‌కుల హ‌డావుడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే భార‌త పౌరుడిగా చెబుతున్నా ఇది అక్రమ కేసు. రాజకీయ ప్రేరేపిత కేసు. బ‌ట్టకాల్చి మీద వేసి ఏదో జ‌రిగింద‌ని రాద్దాంతం చేస్తున్నారు. ఇది క‌క్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచార‌ణ‌కు వెళ్లాను. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి బుర‌ద జ‌ల్లినా న్యాయ‌ప‌రంగా, రాజ్యంగా ప‌రంగా ప్రతి హ‌క్కును వినియోగించుకుంటాను. ఏసీబీ విచార‌ణ‌కు లాయ‌ర్‌ను తీసుకెళ్తానంటే ఎందుకు భయపడుతున్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోంది. హైకోర్టు క్వాష్ పిటిష‌న్‌ను కొట్టివేయగానే... నాకు ఉరి శిక్ష వేశారు. నేరారోప‌ణ రుజువైంద‌ని కాంగ్రెస్ నేతలు సంక‌లు గుద్దుకుంటున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాను" - కేటీఆర్

లాయర్ ను అనుమతించాలని కోర్టుకెళ్తాం

హైద‌రాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను ఆకాశ‌మంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు, విశ్వన‌గ‌రంగా ప్రతిష్టించేందుకు కష్టపడి ప‌నిచేశానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతల్లాగా ఏదో ఆశించి గూడుపుఠాణి కోసం చేయ‌లేదు అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ ఇచ్చిన‌ట్లు బుకాయించారని, అందుకే మిమ్మల్ని న‌మ్మను అని లాయ‌ర్‌ను తీసుకెళ్తానని చెప్పానన్నారు. కానీ ఏసీబీ విచార‌ణ‌కు త‌న‌ లాయ‌ర్‌ను అనుమ‌తించ‌లేదన్నారు. ఈ విషయంపై రేపు కోర్టుకు వెళ్తానని కేటీఆర్ తెలియజేశారు. లాయ‌ర్ల స‌మ‌క్షంలో విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరతానన్నారు.

"110 శాతం చెబుతున్నా ఏ విచార‌ణ‌కైనా వ‌స్తా... కోర్టు అంగీకరిస్తే లాయర్లతో సహా వ‌స్తా. ఈడీ కూడా విచారణకు పిలిచింది. వారి ద‌గ్గరకు కూడా పోతాను. స‌మాధానం చెప్పేందుకు నేను రెడీగా ఉన్నాను. ఇందులో దాప‌రికం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ‌. త‌ప్పకుండా నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డగా, ఏ విచార‌ణ‌నైనా ఎదుర్కొంటాను. ఇది కేవ‌లం ఆరంభం మాత్రమే" అని కేటీఆర్ అన్నారు.

Whats_app_banner