KRMB Meeting : కృష్ణా జలాల్లో సగం వాటాకు తెలంగాణ పట్టు, కేటాయింపులపై చేతులెత్తేసిన కేఆర్ఎంబీ!-hyderabad krmb says krishna water sharing decided central govt after ap telangana demands ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Krmb Meeting : కృష్ణా జలాల్లో సగం వాటాకు తెలంగాణ పట్టు, కేటాయింపులపై చేతులెత్తేసిన కేఆర్ఎంబీ!

KRMB Meeting : కృష్ణా జలాల్లో సగం వాటాకు తెలంగాణ పట్టు, కేటాయింపులపై చేతులెత్తేసిన కేఆర్ఎంబీ!

Bandaru Satyaprasad HT Telugu
Published May 10, 2023 08:55 PM IST

KRMB Meeting : కృష్ణా జల్లాలో మొత్తం 811 టీఎంసీల్లో సగం వాటా కావాల్సిందేనని తెలంగాణ కేఆర్ఎంబీ సమావేశం స్పష్టం చేసింది. దీంతో నీటి వాటా ఇక కేంద్రమే తేల్చుతుందని బోర్డు స్పష్టం చేసింది.

కృష్ణా జలాల పంపిణీ
కృష్ణా జలాల పంపిణీ (HT Telugu)

KRMB Meeting : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ ఇప్పట్లో తేలేలా లేదు. నీటి వాటా కేటాయింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) చేతులెత్తేసింది. ఇక కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని నివేదిస్తామని వెల్లడించింది. జల విద్యుత్‌ ఉత్పత్తి, రూల్‌ కర్వ్స్‌, వరద సమయంలో నీటి లెక్కలకు సంబంధించి జలాశయాల నిర్వహణ కమిటీతో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఛైర్మన్‌ శివనందన్‌ కుమార్‌ నేతృత్వంలో కేఆర్ఎంబీ 17వ సమావేశం హైదరాబాద్‌ లో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్సీ నారాయణరెడ్డి ఇతర సభ్యులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

సగం వాటా కావాల్సిందే

కృష్ణా జలాల్లో తాగునీటి వినియోగాన్ని 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ కోరడంతో దీనిపై సాంకేతికంగా అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు వాటా అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తొమ్మిదేళ్లుగా ఉన్న 66:34 నిష్పత్తిని కొనసాగించాలని ఏపీ కేఆర్ఎంబీని కోరింది. ట్రైబ్యునల్ తప్ప కేటాయింపులు మార్చే అధికారం మరొకరికి లేదని ఏపీ పేర్కొంది. అయితే ఈ నిష్పత్తి తమకు ఆమోదయోగ్యం కాదని వాదించిన తెలంగాణ.. తాత్కాలిక కేటాయింపును తాము వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ కలిపితే 105 టీఎంసీలు వస్తుందని తెలంగాణ తెలిపింది. కృష్ణా జల్లాలో మొత్తం 811 టీఎంసీల్లో సగం వాటా తెలంగాణకు కావాల్సిందేనని వాదనలు వినిపించారు. అయితే నీటి అవసరాలకు త్రిసభ్య కమిటీ ద్వారా నీటిని విడుదలపై ఆదేశాలు ఇస్తూ వాటా తేల్చే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.

జేడీ లక్ష్మీనారాయణ, ఏపీ బీఆర్ఎస్ నేతలు ఎక్కడ- విష్ణువర్ధన్ రెడ్డి

కృష్ణ జలాల విషయంలో ఏపీకి మద్దతుగా నిలబడి కేసీఆర్ నిజాయితీని నిరూపించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు కోరారు. నీటి సమస్య విస్తృతమైనదని, దీనిపై రాజకీయాలు పక్కన పెట్టాలని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో హడావుడి చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఏపీ బీఆర్ఎస్ నేతలు... కృష్ణా జలాల విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. దిగువ రాష్ట్రమైన ఏపీకి కృష్ణా జలాల కేటాయింపులపై మద్దతుగా మాట్లాడాలన్నారు. రాయలసీమకు చెందాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదిలివేస్తున్న వైనంపై మంత్రి కేటీఆర్ స్పందించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Whats_app_banner