Street Dogs Problem : కొంపల్లి కాలనీల్లో కుక్కల స్వైర విహారం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన చిన్నారులు
Street Dogs Problem : కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ, దాడులు చేస్తున్నాయని చిన్నారులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ పై ఫిర్యాదు చేశారు.
Street Dogs Problem : కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గం కొంపల్లిలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడదపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. ఇంత మంది పిల్లలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు రావడం చూసి అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీల్లో ప్రజలు బయటకు రానంతగా కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, వాటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా...కనీస జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నారులు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు చిన్నారు.
హడలెత్తిస్తున్న వీధికుక్కలు
తెలంగాణలో వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై వీధి కుక్కల దాడులు పెరిగిపోయాయి. ఎక్కువ శాతం ఈ దాడులు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో విహాన్ అనే రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అనంతరం బాలుడిని కొంత దూరం వరకు లాకెళ్లాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమి....ఇంట్లో వాళ్లకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలుడు విహన్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు.
జవహర్ నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి అని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్
రాష్ట్రంలో వీధి కుక్కల దాడులను హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడులను పట్టించుకోవడంలేదని ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం దృష్టి కేవలం ధనవంతులు నివసించే ప్రాంతాలపైనే కాకుండా.. సామాన్యులు ఉండే ప్రాంతాలపై పెట్టాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు తక్షణమే పరిష్కార మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది.
సంబంధిత కథనం