Instagram Girl Murder :అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచలనాలు-hyderabad instagram girl murdered lover a few hours after marriage police unfolded case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Instagram Girl Murder :అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచలనాలు

Instagram Girl Murder :అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచలనాలు

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2024 10:54 AM IST

Instagram Girl Murder : ఇన్ స్టాగ్రామ్ పరిచయంతో ఇల్లు విడిచి వెళ్లిన బాలిక విగతజీవిగా మారిన ఘటన హైదరాబాద్ లో సంచలనం అయ్యింది. ఈ కేసులో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ, పెళ్లి పేరుతో బాలిక నమ్మించి అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు దుర్మార్గుడు.

అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచనాలు వెలుగులోకి
అద్దె ఇంట్లోనే పెళ్లి, గంటల వ్యవధిలోనే హత్య-ఇన్ స్టాగ్రామ్ బాలిక మర్డర్ కేసులో సంచనాలు వెలుగులోకి

హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన ఇన్ స్టాగ్రామ్ బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లి పేరుతో వంచించి..పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడో దుర్మార్గుడు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూములోనే దండలు మార్చుకుని ఫొటోలు తీసి బాలికను పెళ్లి చేసుకున్నట్లు...నిందితుడు చింటూ అలియాస్ విఘ్నేష్ బాలిక తల్లిదండ్రులు, పోలీసులను తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో చిన్నచిన్న దొంగతనాల కేసుల్లో చింటూ జైలుకెళ్లినట్లు తెలిసింది.

అసలేం జరిగింది?

మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక... ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేశ్ (చింటూ)తో బాలికకు పరిచయం ఏర్పడింది. ముందు స్నేహంగా మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. చింటూ మాయమాటలు నమ్మి గత నెల 20న బాలిక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. చింటూ, బాలికను తీసుకుని మీర్‌పేటకు చెందిన తన స్నేహితుడు సాకేత్‌, ఛత్రానాకలోని హనుమాన్‌ నగర్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లాడు. సాకేత్‌కు వివాహం అవ్వడంతో...వారు కూడా చిన్న ఇంట్లో ఉండడంతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత నలుగురూ కలిసి మీర్‌పేటలోని శ్రీదత్తనగర్‌లో కాస్త పెద్ద ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇంట్లోంచి వచ్చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను స్నేహితులతో కలిసి ఉంటున్నానని కట్టుకథ అల్లింది. కొన్ని రోజులు బాగానే గడిచింది. బాలికని పెళ్లి చేసుకుంటానని నమ్మించి చింటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

రూములోనే పెళ్లి, స్నేహితులకు ఫొటోలు

నవంబర్ 8న పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన చింటూ పుస్తెలతాడు, పూలదండలు తెచ్చాడు. అద్దె ఇంట్లోనే బాలికకు తాళి కట్టి దండలు మార్చుకుని పెళ్లైపోయినట్లు ఫొటోలు తీసి అందర్నీ నమ్మించేందుకు వారికి ఫొటోలు పంపాడు. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు బాలిక కుటుంబ సభ్యులు, తన స్నేహితులకు పెళ్లి ఫొటోలు పంపాడు. బాలిక ఇన్‌స్టాలో మరొకరితో మాట్లాడుతుందని అనుమానంతో చింటూ ఈ నెల 8న బాలికతో గొడవ పడ్డాడు. పెళ్లి చేసుకుంటే అనుమానం రాదని, ముందు ఆ తంతు కానిచ్చి ఆపై బాలిక మర్డర్ కు ప్లాన్ చేశాడు.

తన స్నేహితుడు, అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో బాలికతో గొడవపడ్డాడు. ఈ గొడవలో బాలికను గోడకేసి కొట్టి హత్య చేశాడు. పెళ్లి చేసుకున్న గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు చింటూ. ఆ తర్వాత విషయాన్ని తన స్నేహితుడు, అతని భార్య చెప్పి శవాన్ని మాయం చేయాలని భావించాడు. చింటూ, తన స్నేహితుడు సాకేత్‌తో కలిసి తుక్కుగూడ సమీపంలోని ప్లాస్టిక్ వ్యర్థాల తుక్కులో బాలిక మృతదేహాన్ని పడేశారు.

నాటకానికి తెర

అయితే ఈ నెల 8న మధ్యాహ్నం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చింటూ మీ కుమార్తె కనిపించడం లేదంటూ నాటకం మొదలుపెట్టాడు. ఆమె స్నేహితులకు ఫోన్ చేసి వారి దగ్గరకు వచ్చిందా అని విచారించాడు. ఈ నెల 8న చింటూ వాట్సాప్ కాల్స్ ఎక్కువ మాట్లాడడం, అదే రోజు బాలిక మిస్ కావడంతో అనుమానంతో పోలీసులు...అతడిని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ.

Whats_app_banner

సంబంధిత కథనం