BJP Protest : బీజేపీ నిరాహార దీక్ష భగ్నం, సొమ్మసిల్లి పడిపోయిన కిషన్ రెడ్డి
BJP Protest : తెలంగాణ బీజేపీ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో కిషన్ రెడ్డి సొమ్మసిల్లిపడిపోయారు.
BJP Protest : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ ఉపవాస దీక్షను భగ్నం చేసే క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని ధర్నా చౌక్ నుంచి తరలించడానికి ప్రయత్నించగా బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
బలవంతంగా తరలింపు
ఇవాళ సాయంత్రం 6గంటల వరకే బీజేపీ నిరాహార దీక్షకు అనుమతి ఉందని పోలీసులు అన్నారు. వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30 గంటల సమయంలో పోలీసులు కిషన్ రెడ్డికి తెలిపారు. అయితే గురువారం ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి చెప్పడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. అప్పుడు వెనక్కి తగ్గిన రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నా చౌక్‌కు చేరుకుని తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్ రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
అంతకు ముందు జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగుల్ని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో యువత గిరిగీసి పోరాటం చేసిందని, సాగరహారం, వంటావార్పు, మిలియన్ మార్చ్ లో యువత కీలక పాత్రపోషించిందన్నారు.