హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం-hyderabad icomm caracal pact small arms manufacturing facility inaugurated ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ లో క్యారకల్-ఐకామ్ భాగస్వామ్యంతో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఆయుధాల ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఐ కామ్ సంస్థ తెలిపింది.

హైదరాబాద్ లో అత్యాధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం

దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే ప్రపంచ శ్రేణి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ సోమవారం ప్రారంభించింది. ఐకామ్ సమీకృత ఇంజినీరింగ్ విభాగం ఆవరణలో ఈ ఆయుధ తయారీ కేంద్రాన్ని ఐకామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు, క్యారకల్ సీఈఓ హమద్ అల్ అమెరి సంయుక్తంగా ప్రారంభించారు.

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇక్కడ తయారయ్యే ఆయుధాలు భారత సాయుధ దళాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( సీఏపీఎఫ్ఎస్ ), సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, ఎస్పీజీ వంటి సంస్థల కీలక అవసరాలను తీరుస్తాయి. అలాగే క్యారకల్ సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాలకు ఆయుధాల్ని ఎగుమతి చేసేందుకు హైదరాబాద్ లోని ఆయుధ తయారీ కేంద్రం ఉపయోగపడుతుంది. యూఏఈ సంస్థ భారత దేశానికి తొలిసారి చిన్న ఆయుధాల తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది.

క్యారకల్, హైదరాబాద్ లో ఉన్న ఐకామ్ కేంద్రంలో మిషన్-ప్రూవెన్ కార్ 816 క్లోజ్-క్వార్టర్స్ బాటిల్ రైఫిల్, లక్ష్యాన్ని చేధించగలిగే కార్ 817 అసాల్ట్ రైఫిల్, తేలికపాటి సీఎస్ఆర్ 338, 308 బోల్ట్-యాక్షన్ స్నిపర్ రైఫిల్స్, లక్ష్యాన్ని ఛేదించే అత్యంత కచ్చితమైన సీఎస్ఆర్ 50 బోల్ట్-యాక్షన్ యాంటీ-మెటీరియల్ స్నిపర్ రైఫిల్, ఆధునిక సీఎంపీ 9 సబ్మెషిన్ గన్, పలు రకాలుగా ఉపయోగపడే క్యారకల్ ఈఎఫ్, క్యారకల్ ఎఫ్జెన్ 2 కాంబాక్ట్ పిస్టల్స్ తయారు చేస్తారు.

రక్షణ సహకారంలో ఓ మైలురాయి

ఈ సందర్భంగా ఐకామ్ టెలీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు మాట్లాడుతూ....ఈ కర్మాగారం భారతదేశ రక్షణ దళాలకు తమ తిరుగులేని నిబద్ధత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ దృష్టిపై మా నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఐకామ్ లో, దేశంతో పాటు ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఆయుధాలను తయారు చేస్తున్నామని తెలిపారు. తమ ఆయుధ తయారీ కేంద్రం కారకల్ తో చారిత్రాత్మక సాంకేతిక బదిలీ (టీఓటీ) ఒప్పందం కింద అత్యాధునిక సమగ్ర శ్రేణి ఆయుధాల తయారీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది యూఏఈ-భారతదేశ రక్షణ సహకారంలో ఒక మైలురాయిని సూచిస్తుంది అన్నారు.

విశ్వసనీయ, దూరదృష్టి గల భాగస్వామి క్యారకల్ తో కలిసి, మేము ప్రపంచ స్థాయి ఆయుధాలను మాత్రమే కాకుండా, ధైర్యమైన, స్వయం-సమృద్ధి గల భారతదేశాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. నూతన ఆయుధ తయారీ కేంద్రం భారత దేశ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఒక మూలస్తంభం, ఇది ప్రపంచ సాంకేతికతను మన దేశ నైపుణ్యంతో మిళితం చేస్తుంది. ఇది కారకల్ అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది, భారతదేశాన్ని విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ ఉత్పత్తి కేంద్రంగా బలోపేతం చేస్తుంది అని సుమంత్ అన్నారు.

మేక్ ఇన్ ఇండియాలో

క్యారకల్ సీఈవో హమద్ అల్ అమెరి మాట్లాడుతూ... ఐకామ్ క్యారకల్ చిన్న ఆయుధాల తయారీ కేంద్రం ప్రారంభం భారతీయ మార్కెట్, రక్షణ పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రయత్నాలలో ఒక మైలురాయిని సూచిస్తుందన్నారు. ఐకామ్ ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం, జాతీయ స్వావలంబన పట్ల బలమైన నిబద్ధత కలిగిన అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయమైన భాగస్వామి అన్నారు.

"యూఏఈ నుంచి భారతదేశానికి జరిగిన మొట్టమొదటి చిన్న ఆయుధాల సాంకేతిక బదిలీ వల్లే ఐకామ్, క్యారకల్ ఆయుధ తయారీ కేంద్రం ప్రారంభం సాధ్యమైంది. ఈ కర్మాగారం ప్రధాన మంత్రి మోదీ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు, మా నిబద్ధతకు నిదర్శనం. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత దేశ రక్షణ వ్యవస్థలో మా పాత్రను మరింతగా పెంచుతున్నందుకు గర్విస్తున్నాము" అని అమెరి అన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం