HYDRA Demolition in Madhapur : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా, అయ్యప్ప సొసైటీలో ఐదంతస్తుల భవనం కూల్చివేత
HYDRA Demolition in Madhapur : హైదరాబాద్ మాదాపూర్ లోని అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చివేస్తుంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకొని అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేసింది.
HYDRA Demolition in Madhapur : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తుంది. మాదాపూర్‌లోని అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తుంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారిని ఆనుకొని అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేసింది. గత ఏడాదే ఈ భవనానికి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం హైకోర్టు కూడా ఈ భవనం అక్రమ కట్టడమని నిర్థారించింది. ఈ నేపథ్యంలో శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ఆదివారం కూల్చివేత చేపట్టారు. ఈ బిల్డింగ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య మాధపూర్‌లోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేత చేపట్టింది. హైడ్రా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసేందుకు భారీ క్రేన్‌లను మోహరించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
హైడ్రా కూల్చి వేతల పర్వం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పరిశీలించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు. అక్కడికక్కడే జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను రంగనాథ్ పరిశీలించారు.
అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించాక కూడా కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. ఈ అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నట్టు 14.2.24న షోకాజ్ నోటీసులను జీహెచ్ ఎంసీ జారీ చేసిందని… అలాగే 26.2.24న స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత హైకోర్టు కూడా రిట్ పిటిషన్ నంబరు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్రమ నిర్మాణమని నిర్ధారించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని 19.04.24 తేదీన ఆదేశించిందని చెప్పారు.
హైకోర్టు ఆర్డర్ ను ఆధారంగా తీసుకుని 13.06.2024 తేదీన ఇదే భవనం అక్రమమని జీహెచ్ఎంసీ కొంత భాగాన్ని కూల్చివేసిందని రంగనాథ్ వివరించారు. ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారంటూ స్థానిక అధికారుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలిపారు.