HMDA Ganesh Idols Distribution : హైదరాబాద్ లో గణేష్ చతుర్థి హడావుడి మొదలైంది. కాలనీల్లో గణేష్ మండపాలు సిద్ధమవుతున్నాయి. భారీగా గణేష్ విగ్రహాలను వాహనాల్లో మండపాలకు తరలిస్తున్నారు. అయితే మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రికార్డు సృష్టించింది. వరుసగా నాలుగు రోజులపాటు దాదాపు 60 కేంద్రాలలో హెచ్ఎండీఏ యంత్రాంగం 1.5 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది.
హెచ్ఎండీఏ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 14న అధికారికంగా ప్రారంభించారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్ కుమార్, సీఎస్ శాంతి కుమారికి హెచ్ఎండీఏ గణపతి విగ్రహాన్ని అందజేశారు. ఆ తర్వాత హెచ్ఎండీఏ యంత్రాంగం జంట నగరాలు, శివారు ప్రాంతాలలో గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. హెచ్ఎండీఏ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి విస్తృతంగా మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం వద్ద ఇప్పటికే సందడి మొదలైంది. వినాయక చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది శ్రీదశ మహా విద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజులపాటు ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలిపూజతో ప్రారంభం అవుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకోనున్నారు. ఖైరతాబాద్ గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.