Gachibowli Building : 50 గజాల్లో నాలుగంతస్తులు, పెంట్ హౌస్-అద్దెల కోసం కక్కుర్తి పడితే కూలిపోయే పరిస్థితిలో భవనం
Gachibowli Building : హైదరాబాద్ గచ్చిబౌలిలో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. 50 గజాల్లో ఆరు స్లాబులతో నాలుగంతస్తులు, పెంట్ హౌస్ నిర్మించారు. ఈ భవనం పక్కన నూతన నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించి, కూల్చివేతకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిఖీనగర్ లో నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో అందులో నివసిస్తున్న వారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అతి తక్కువ స్థలం 50 గజాల్లో జీ+4, పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టడమే భవనం పక్కకు ఒరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. భవనం పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
కొండాపూర్ డివిజన్ లోని సిద్ధిఖీనగర్‌లో ప్లాట్ నెంబర్ 1639లో 50 గజాల స్థలంలో వి.లక్ష్మణ్, స్వప్న దంపతులు హ్యాపీ రెసిడెన్సీ పేరుతో నాలుగు అంతస్తుల భవనం, పైన పెంట్ హౌస్ నిర్మించారు. మంగళవారం రాత్రి ఈ భవనం ఒక్కసారిగా పక్కకు ఒరగడం అందులో నివసిస్తున్న వారు భయాందోళన గురయ్యారు. భవనంలో దాదాపు 50 మంది నివసిస్తున్నారు. వారంతా ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. మూడో అంతస్తులో ఉంటున్న ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
భవనం పక్క భారీ గుంతలు
50 గజాల స్థలంలో రెండేళ్ల కిందట గ్రౌండ్ ఫ్లోరు, నాలుగు అంతస్తుల్లో రెండేసి గదులు, పెంట్‌హౌస్‌లో ఒక గది చొప్పున నిర్మించారు. ఈ రూములతో స్థానికంగా ఉపాధి పొందుతున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 50 మంది నివసిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆ బిల్డింగ్ వెనుక భాగంలో మరో కొత్త భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. మంగళవారం ఉదయం హ్యాపీ రెసిడెన్సీకి ఆనుకుని రెండు పిల్లర్లకు భారీ గుంతలు తవ్వారు. దీంతో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగిపోయింది. భవనంలో నివసిస్తున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఆరు స్లాబులు
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ అధికారులు, సిబ్బంది...హ్యాపీ రెసిడెన్సీతో పాటు దాని పక్కనున్న మరో రెండు బిల్డింగ్ లను ఖాళీ చేయించారు. వారందరినీ స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాలుకు తరలించారు. ఒరిగిన బిల్డింగ్ ను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 50 గజాల్లో ఆరు స్లాబులు వేయడం చూసి అధికారులు షాకయ్యారు. గదులు అగ్గిపెట్టేలను తలపిస్తున్నాయన్నారు. బిల్డింగ్ తొలిగించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం