Hyderabad Formula E - race : హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ-రేసింగ్ రద్దు
Hyderabad Formula E - race Updates: హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
Hyderabad Formula E - Race :హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్ రద్దైంది. ఈ-రేస్ సీజన్-10 నాలుగో రౌండ్ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా…. రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ప్రకటించింది. గత ప్రభుత్వం ఒప్పందం కుదిరినప్పటికీ…. ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్ణమైన నిర్ణయం రాకపోవడమే ఇందుకు కారణం అని పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందాన్ని(అక్టోబరు 30, 2023) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ(MAUD) రద్దు చేసిందని ఫార్ములా-ఇ ఆపరేషన్స్ (FEO) ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పందిస్తూ… “ఒప్పంద ఉల్లంఘనలపై మున్సిపాల్ శాఖకు అధికారికంగా నోటీసు ఇచ్చే అంశాన్ని FEO(formula e operations) పరిశీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు వేరే మార్గం లేదు. ఈ రేసింగ్ వేదిక, నిర్వహణకు వర్తించే చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై పరిశీలిస్తున్నాం. ఆ విషయంలో FEOకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి" అని ఫార్ములా-ఇ ఆపరేషన్స్ తమ ప్రకటనలో రాసుకొచ్చింది. సీజన్ 10 కోసం ABB-FIA ఫార్ములా ఈ- వరల్డ్ ఛాంపియన్‌షిప్ క్యాలెండర్‌లో వేదికలుగా నిర్ణయించిన నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ ఉన్నాయని తెలిపింది. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది.
ఫార్ములా E యొక్క సహ-వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో స్పందిస్తూ…. “హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దు ప్రకటన భారత్ లోని రేసింగ్ అభిమానులకు నిరాశ కలిగించే విషయం” అని అన్నారు.ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (FMSCI) అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీంతో పాటు అతని బృందం ఫార్ములా ఈ ని హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అద్భుతమైన సహకారం అందించారని గుర్తు చేశారు.
భారత్ లో మొదటి సారిగా గతేడాది జనవరిలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేసింగ్ పోటీలు జరిగిన సంగతి తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరాన ఇందుకు సంబంధించిన పోటీలు జరగగా… మంచి స్పందన లభించింది. గతేడాది జరిగిన రేస్ చాలా విజయవంతమైందని… ఈ రేసు నిర్వహణతో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావం చూపిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ చెప్పారు.
కేటీఆర్ సీరియస్…
ఫార్ములా ఈ - రేసింగ్ రద్దుపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయన్న ఆయన…. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా - ఈ రేస్‌ను కేసీఆర్ సర్కార్ చక్కటి అవకాశంగా ఉపయోగించుకుందని చెప్పారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించామని చెప్పారు కేటీఆర్. ఇక ఈ రేసింగ్ రద్దుపై నిర్వహకులు ప్రకటన చేయగా.. తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.