Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య-hyderabad family issues women committed suicide give poison to two child ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Published Jun 29, 2024 04:05 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వివాహిత తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకుంది. పిల్లల్లో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది.

హైదరాబాద్ లో విషాదం, ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ లో విషాదం, ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Hyderabad Crime : హైదరాబాద్ లోని శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆర్జీఐయే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి చెందిన సోమశేఖర్, ప్రియాంక దంపతులు గత కొంతకాలంగా అర్బీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల అద్విక్, ఏడు నెలల ఆరాధ్య పిల్లలు ఉన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సోమశేఖర్ శుక్రవారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆయన భార్య ప్రియాంక హాల్ లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు ఇద్దరు పిల్లలు కూడా బెడ్ మీద స్పృహ కోల్పోయి ఉన్నారు. సోమశేఖర్ హుటాహుటిన పిల్లలను ఆస్పత్రికి తరలించగా..... అద్విక్ ఆరోగ్యం నిలకడగా ఉండగా, ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని ఆర్జీఐయే ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు. మృతురాలు బంధువులు ఎవరూ ఇంకా ఫిర్యాదు చేయలేదని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

పని దొరకడం లేదని యువకుడు ఆత్మహత్య

పని దొరకడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా అడవి దేవుల పల్లి గ్రామానికి చెందిన బి. వెంకటరమణ (21) పని కోసం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అయితే ఎక్కడా ఎలాంటి పని లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకటరమణ.....రామంతాపూర్ లోని తన బావమరిది ఇంటికి వచ్చి అక్కడ పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నీటి సంపులో పడిపోయి రెండేళ్ల బాలుడు మృతి

శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పొట్ట కూటి కోసం వలస వచ్చిన దంపతులకు కడుపు కోత మిగిలింది. నర్సరీ నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రేష్మ, సురేంద్ర దంపతులకు మనావ్ (2) కుమారుడు ఉన్నాడు. కాగా HMDA ఆధ్వర్యంలోని తూం కుంట మున్సిపాలిటీ లోని క్రీడా ప్రాంగణంలో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం దంపతులు ఇద్దరూ నర్సరీలో పని చేస్తుండగా......అక్కడే ఆడుకుంటున్న తమ రెండేళ్ల మానవ్ ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న నీటి సంపులో పడి మునిగిపోయాడు. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు,స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం