Hyderabad Dhar Gang : హైదరాబాద్ లో ధార్ గ్యాంగ్ హల్ చల్, అర్ధరాత్రి ఎవరైనా తలుపులు కొడితే తెరవొద్దు!
Hyderabad Dhar Gang : హైదరాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ తరహాలో మరో గ్యాంగ్ హల్ చల్ చేస్తుంది. ఖాకీ సినిమా తరహాలో శివారు ప్రాంతాల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రులు తలుపులు కొట్టి ఇళ్లలోకి బలవంతంగా చొరబడి చోరీచేస్తున్నారు.
Hyderabad Dhar Gang : హైదరాబాద్ నగరాన్ని గతంలో వణికించిన చెడ్డి గ్యాంగ్ తరహాలోనే ఇప్పుడు మరో గ్యాంగ్ నగర వాసులను బెంబేలెత్తిస్తుంది. నగరంలో కొత్తగా సంచరిస్తున్న ఈ భయంకరమైన గ్యాంగ్ పేరు " ధార్". ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నుంచి ఏడుగురు దొంగలు ఓ ముఠాగా ఏర్పడి లాడ్జ్ లలో ఉంటూ పగటి పూట అంతా ఆటోలో రెక్కి నిర్వహించి.....రాత్రి సమయంలో ఇళ్లలో చొరబడి దోచుకుంటున్నారు. వారిని అడ్డుకుంటే వారి వద్ద ఉన్న మారణాయుధాలతో దాడి చేస్తారు. అవసరమైతే చంపుతారు కూడా. కాగా తాజాగా ఈ ముఠా నగర శివారు ప్రాంతాల్లో పలు ఇళల్లో చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయాయి. ఆ వీడియోలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ వాసులు ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలా దోచుకుంటారు.....జాగ్రత్త
పగటి పూట శివారు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను ముందుగా పసిగడతారు. తరువాత ఆయా కాలనీలకు ఆటోలో వెళ్లి ఏమైనా వస్తువులు, కూరగాయలు, చద్దర్లు.... కొంటారా అని గేట్ లు తట్టి అడుగుతారు. ఆ క్రమంలోనే ఇంట్లో దాదాపు ఎంత మంది ఉండొచ్చు, ఎవరైనా ముసలి వాళ్లు ఉన్నారా, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని గమనిస్తారు. అర్ధరాత్రి సమయంలో వాళ్లు దోచుకోవాలి అనుకున్న ఇంటి గేట్ నుంచి కాకుండా కాంపౌండ్ వాల్ నుంచి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి తలుపులు కొడతారు, పొరపాటున తీస్తే అంతే సంగతి. డోర్ తీసిన వెంటనే మూకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేసి ఇంట్లో ఉన్న డబ్బు,బంగారం అంతా దోచుకుంటారు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువగా
అయితే నగరంలోని హయత్ నగర్,అమీన్ పూర్, వనస్థలిపురం,ఉప్పల్, బోడుప్పల్, ఘట్ కేసర్, బాచుపల్లి ప్రాంతాల్లో ఈ దార్ గ్యాంగ్ ఎక్కువగా సంచరిస్తునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయా ఏరియాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రిపూట ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాలంటూ పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆ ఇంటి సభ్యుడు కాకుండా, వేరే వ్యక్తి తలుపు తట్టినప్పుడు వెంటనే డోర్ తియ్యకుండా, ముందు ఇంటి పక్కన వారిని అప్రమత్తం చేసి, కిటికి అద్దం నుంచి కన్ఫర్మ్ చేసుకున్న తరువాతే డోర్ తీయ్యాలని, ఇంట్లో ఎక్కువ మొత్తంలో బంగారం, డబ్బు నిల్వ పెట్టుకోవడం అంత భద్రత కాదని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎక్కడికైనా వెళితే ఇంటి పక్కన వాళ్లని తమ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పాలని, పోలీసులు సూచిస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా