Hyderabad Crime : హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అమీర్ (33) వెండితెరపై నటుడుగా వెలగాలనుకున్నాడు. అవకాశాలు రాక చివరకు డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు. శుక్రవారం డ్రగ్స్ సరఫరా చేస్తూ టాస్క్ ఫోర్స్, ఫలక్ నుమా పోలీసులకు పట్టుబడ్డాడు. డీసీపీ పి. సాయి చైతన్య వెల్లడించిన వివరాల ప్రకారం......మొహమ్మద్ అమీర్ (33) రెండేళ్ల క్రితం ముంబయి వెళ్లి అక్కడ మోడలింగ్, సినిమాల్లో అవకాశాల కోసం రెండు సంవత్సరాలు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే కొన్ని సినిమాల్లో చిన్న వేషాలు వేశాడు.
ముంబయిలో డ్రగ్స్ కు అలవాటు పడ్డ అమీర్... అక్కడ వచ్చే సంపాదన సరిపోక ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద ఉపాధి చూసుకున్నాడు. అక్కడ వచ్చే సంపాదన కూడా అమీర్ కు చాలకపోవడంతో......డ్రగ్స్ బిజినెస్ చేయాలని పథకం వసుకున్నాడు. అమీర్ సినిమాల కోసమని విమానంలో తరచూ ముంబయికి వెళ్లి అక్కడ 20-40 గ్రాముల ఎండియే కొనుగోలు చేసి ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ కు వస్తూ ఉండేవాడు. ఒక్క గ్రామ్ ఎండియే ముంబయిలో రూ.4000 కు కొనుగోలు చేసి హైదరాబాద్ లో రూ.8000 నుంచి రూ.10000 వరకు అమ్మేవాడు. గత నాలుగు నెలలుగా ప్రతి నెల రెండుసార్లు ముంబయికి ఇదే పనిగా అమీర్ వెళ్లొచ్చేవాడు. అమీర్ కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్, ఫలక్ నుమా పోలీసులు.....శుక్రవారం వట్టపల్లి వద్ద కేశవ నగర్ కు చెందిన ఓ కస్టమర్ కు డ్రగ్స్ అమ్ముతూ ఉండగా పోలీసులకు పట్టుపడ్డాడు .ముంబయికి చెందిన డ్రగ్స్ పెడ్లర్ పటేల్ వద్ద అమీర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మహమ్మద్ అమీర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
హైదరాబాద్ లో నకిలీ జ్యోతిష్యడిని శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ జ్యోతిష్యుడు అలియాస్ మంజునాథ్ అలియాస్ బ్రహ్మం రాజు (38 ) ను సిటీ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. అనంతరం అతడి నుంచి రూ. 14.65 లక్షల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లు, ఇతర పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్ కేంద్రంగా దుర్గాదేవి జ్యోతిష్యాలయం, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాల పేరిట ఈ నకిలీ జ్యోతిష్యుడు పూజలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ ల ద్వారా ప్రకటనలు చేయిస్తూ అమాయకులైన ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు దోచుకొని నకిలీ జ్యోతిష్యుడు మంజునాథ్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు రూ.17 లక్షల వరకు ప్రజల నుంచీ మంజునాథ్ అలియాస్ బ్రహ్మం రాజు వసూల్ చేసినట్లు డీసీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా