Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం, గుండెపోటుతో డీసీపీ కుమారుడు మృతి
Hyderabad Crime : హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు గుండెపోటుతో మరణించాడు.
Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. మాదాపూర్ సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు చిన్నకుమారుడు చంద్ర తేజ్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం అర్ధరాత్రి చంద్రతేజ్ కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మొదట్లో వైద్యుల చికిత్సకు స్పందించిన చంద్రతేజ్... మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు హఠాత్తుగా గుండెపోటుతో మరణించటంతో చంద్రతేజ్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. చంద్ర తేజ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు నల్లగొండ జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. చంద్రతేజ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సొంత వ్యాపారంలో రాణిస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్ర తేజ్ తన సొంత డబ్బులతో తండ్రి వెంకటేశ్వర్లుకు ఓ కారును బహుమతిగా ఇచ్చాడని...ఈలోపే ఇలా మరణించాడని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వనపర్తిలో దారుణం తండ్రిని చంపిన కొడుకు
వనపర్తి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కొడుకే కాటికి పంపాడు. వనపర్తి మండలం చీమల గుట్టపల్లి గ్రామానికి చెందిన బచ్చన్న( 94) అనే వృద్ధుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. అందరూ జీవితంలో స్థిరపడ్డారు. 9 సంవత్సరాలు క్రితం బచ్చన్న భార్య అనారోగ్య కారణాలతో మరణించడంతో బచ్చన్నను ముగ్గురు కొడుకులు ప్రతి సంవత్సరం ఒకరు చొప్పున పోషించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ పెద్దకొడుకు కురుమన్న ఈ తొమ్మిదేళ్ల కాలంలో తండ్రిని ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. హైదరాబాద్ వలస వెళ్లి జీవనం సాగిస్తున్నాడు కురుమన్న. ఇటీవల గ్రామానికి వచ్చిన కురుమన్నను మిగిలిన ఇద్దరు సోదరులు నాన్నను ఎందుకు పట్టించుకోవంటూ గొడవకి దిగారు. తండ్రికి వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తుండడంతో తనను నేను పోషిస్తానని తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్లాడు కురుమన్న. అక్కడ బచ్చన్న ప్రమాదవశాత్తు కిందపడి కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీంతో కురుమన్న తండ్రిని తిరిగి సొంత ఊరికి తీసుకువచ్చాడు. తండ్రిని పోషించడం ఇష్టం లేక సోమవారం గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న వనపర్తి రూరల్ ఎస్సై నాగన్న సంఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా