TPCC New Chief : టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!-hyderabad congress high command gives free hand to cm revanth reddy on tpcc chief selection ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tpcc New Chief : టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!

TPCC New Chief : టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!

HT Telugu Desk HT Telugu
Jun 28, 2024 10:11 PM IST

TPCC New Chief : టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తుంది. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకం కానుందని సమచారం. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!
టీపీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ, ఆయనకే ఖరారంటూ లీకులు!

TPCC New Chief : కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన అభ్యర్థించిన వ్యక్తులకే పీసీసీ పగ్గాలను అప్పగించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో ఇక్కడ సీఎం రేవంత్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే పార్టీ బాధ్యతలను బీసీ నేతకే అప్పగిస్తారా? లేక ఎస్సీ, ఎస్టీ నేతలకు కట్టబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా కొందరు మంత్రులు పీసీసీ పదవి కోసం ప్రయత్నించగా.....జోడు పదవులు లేవని అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు అన్నీ విషయాల్లో ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చేది. మళ్లీ ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ అదే ప్రాధాన్యత ఇస్తుందని చెప్పాలి. 2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాటి పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆ పదవికోసం అనేకమంది ప్రయత్నించినా......చివరకు వైఎస్ఆర్ ప్రతిపాదించిన కేశవరావుకే ఆ పదవి దక్కింది. అది అలా ఉంచితే పీసీసీ అధ్యక్షుడు ఎంపిక విషయంలో ఇద్దరి బీసీ నేతలు,ఇద్దరి ఎస్సీ నేతల పేర్ల అధిష్ఠానంకు వెళ్లినట్టు సమాచారం.

విభేదాలు, అసమ్మతి లేకుండా

పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం, పీసీసీ చీఫ్ కు మధ్య ఎలాంటి విబేధాలు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది. అందుకే సీఎంకు సన్నిహితంగా ఉండే నేతనే పీసీసీగా నియమిస్తే ఎలాంటి విభేదాలు ఉండవని అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తిని నియమించాలని భావిస్తుంది. ఒకవేళ సీఎం తో పడని వ్యక్తిని నియమిస్తే నిత్యం ఇరువురు మధ్య విభేదాలు, అసమత్తి ఏర్పడి గ్రూపులుగా విడిపోవడం, ఫలితంగా పార్టీకి నష్టం జరిగి బలహీన పడే అవకాశం ఉందని దిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారట. అయితే ఓ సిట్టింగ్ ఎంపీని స్టేట్ చీఫ్ చేసే ఛాన్స్ ఉన్నాయంటూ గాంధీ భవన్ నుంచి లీకులు వస్తున్నాయి.

బీసీ ఎంపీకే పీసీసీ పగ్గాలు

ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎం పదవి ఇవ్వడంతో, ఇప్పుడు పీసీసీ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని అధిష్ఠానం ఎన్నో రోజుల కిందటే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీంతో తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ సోనియా గాంధీని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్ సంపత్ కుమార్ లాబీయింగ్ చేస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ పదవిని బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీకి ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రతిపాదన చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు నేతకు రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం, పార్టీ కష్టకాలంలో కొనసాగిన తీరు, తాత ముత్తాతలు అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారే. దీంతో అతడికే దక్కుతుందంటూ లీకులు వస్తున్నాయి. వచ్చే నెల ఏడో తేదీ లోపు ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి కాలం ముగుస్తుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్ఠానం స్పీడ్ పెంచింది. ఇప్పటికే రేవంత్ ప్రతిపాదనను స్వీకరించిన దిల్లీ పెద్దలు త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించనున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel

సంబంధిత కథనం