Madhu Yaskhi On Chandrababu : చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్,మోదీ- బెయిల్ రాకుండా కుట్ర - మధుయాష్కీ గౌడ్
Madhu Yaskhi On Chandrababu : చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్, జగన్, మోదీ ఉన్నారని ఆరోపించారు.
Madhu Yaskhi On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందించారు. చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ హస్తం ఉందని ఆరోపించారు. కుట్ర చేసి చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం జగన్ ఇద్దరూ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారన్నారు. కేసీఆర్‌కు తెలియకుండా వైఎస్ జగన్ ఏం చేయారన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం కేసీఆర్ సూట్ కేసులను పంపించారని మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనన్నారు. ఈ మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడానికి నిరాకరించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
"చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్, మోదీ అన్నారు. ఎన్డీఏ టైం నుంచి చంద్రబాబుపై మోదీకి కోపం ఉంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయంపై మాకు పూర్తి సమాచారం ఉంది. కేసీఆర్, మోదీ ప్లాన్ ప్రకారం ఏపీ ప్రభుత్వం సాయంతో చంద్రబాబును అరెస్ట్ చేయించారు"- మధుయాష్కీ గౌడ్
కేంద్ర దర్యాప్తు సంస్థల సమాచారంతోనే!
అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలే ఏపీ ప్రభుత్వానికి కీలక సమాచారం అందాయని చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ స్పష్టం చేసింది. 2018లో మహారాష్ట్రలో జీఎస్‌టి, ఐటీ, ఆ తర్వాత ఈడీ దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని వెల్లడించింది. ఆ నివేదికలే ఏపీ సీఐడీకి ఈ కేసులో దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలు అని పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో కీలకమైన డిజైన్‌టెక్ పూణె కు చెందిన సంస్థ. ఈ సంస్థ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంలేదని, సింగపూర్‌లో రిజిస్టరైన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్‌లతో వస్తువులు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ కీలక సమాచారంతో ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసింది. కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.
చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని పలువురు నేతలు ఖండించారు. తెలుగు రాష్ట్రాలతో సహా జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు.