Hyderabad Cognizant Center : హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఉద్యోగాలు-hyderabad cognizant establish new center will generate 15 thousand jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Cognizant Center : హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఉద్యోగాలు

Hyderabad Cognizant Center : హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఉద్యోగాలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 05, 2024 09:39 PM IST

Hyderabad Cognizant Center : ఐటీ రంగంలో కీలకమైన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో విస్తరణకు అంగీకరించింది. మరో 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ సేవలు విస్తరిస్తామని అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు హామీ ఇచ్చింది.

హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఉద్యోగాలు
హైదరాబాద్​ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఉద్యోగాలు

Hyderabad Cognizant Center : ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భేటీలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. గత ఏడాది సీఎం బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఒప్పందానికి పునాదులు పడ్డాయి.

కాగ్నిజెంట్ సెంటర్

సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్​ లో తమ కంపెనీ విస్తరణకు మొగ్గు చూపింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు. హైదరాబాద్ లో నెలకొల్పే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని రవికుమార్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఐటీ విస్తరణ

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని సీఎం అన్నారు.

టైర్-2 నరగాల్లో ఐటీ సేవలు

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనం