CM KCR On Floods : వరద పరిస్థితిపై మూడో రోజూ సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఆరా తీస్తూ... క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పలు ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఫోన్లో ఆదేశించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ ముంపునకు గురైన ప్రాంతాల్లో హెలికాప్టర్లు ద్వారా ఆహారం, తాగునీరు. మందులను అందించేలా సీఎస్ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల కొనసాగించాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో పురపాలకశాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ముంపు కాలనీలు, మూసీ పరివాహక ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముంపునకు గురైన వైద్య సేవలపై సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిగమ్నమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తున్న మంత్రి హరీష్ రావు, ఆస్పత్రుల్లో, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందులు సరఫరా పరిస్థితిని సీఎంకు ఫోన్లో వివరించారు.
ఎగువన గోదావరి ప్రాంతంలో వదర ఉద్ధృతి కొనసాగుతుండటంతో భద్రాచలంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి జరిగిన నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్ ను ఫోన్లో ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు.
ఎగువ నుంచి గోదావరికి వరద పెరగడంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నేపథ్యలో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు ఇన్ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. నీటిని కిందికి వదలాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు.