CM KCR : దేశంలో ఎమర్జెన్సీ రోజులు, కేంద్రం అరాచకాలు ఎక్కువైయ్యాయ్- సీఎం కేసీఆర్-hyderabad cm kcr arvind kejriwal bhagwant mann singh criticises modi government at centre emergency days in country ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Cm Kcr Arvind Kejriwal Bhagwant Mann Singh Criticises Modi Government At Centre Emergency Days In Country

CM KCR : దేశంలో ఎమర్జెన్సీ రోజులు, కేంద్రం అరాచకాలు ఎక్కువైయ్యాయ్- సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
May 27, 2023 04:29 PM IST

CM KCR : దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆగడాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక, పాలనా పర ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పంజాబ్ సీఎం మాన్ సింగ్, సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్
పంజాబ్ సీఎం మాన్ సింగ్, సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్

CM KCR : హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ భేటీ అయ్యారు. అనంతరం ప్రగతి భవన్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు ఎక్కువైయ్యాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయనియ్యడం లేదన్నారు. కేంద్రం ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్ సీటును కైవసం చేసుకుందని గుర్తుచేశారు. గ్రూప్-1 అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ఇందిరా గాంధీ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదని, కేంద్రం ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలో వెళ్తుందని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

"ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు మా మద్దతు ఉంటుంది. లోక్ సభ, రాజ్యసభలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది. మోదీ ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోంది . మోదీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలి. ఎమర్జెన్సీ వచ్చే ముందు అప్పుడు ఇలాగే జరిగింది. కర్ణాటక ప్రజలు బీజేపీకి సరైన సమాధానం చెప్పారు..భవిష్యత్ లో దేశం అంతా నేర్పుతుంది. మోదీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, గవర్నర్లు ఏంది? గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోంది. వంగి వంగి కోతి దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారు" - సీఎం కేసీఆర్

ఆర్డినెన్స్ అడ్డుకోవాలని నాన్ బీజేపీ పార్టీలను కోరుతున్నా- అర్వింద్ కేజ్రీవాల్

ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ చర్చ జరిగిందని దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ పోరాటం దిల్లీ కోసం మాత్రమే కాదు దేశం కోసం అన్నారు. ఈ పోరాటం రాజ్యాంగ పరిరక్షణ కోసమన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉండేవన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారాలను తీసివేశారన్నారు. మేము 8 ఏళ్లు దిల్లీ ప్రజల కోసం పోరాటం చేశామన్నారు. సుప్రీంకోర్టులో 8 ఏళ్ల తరువాత న్యాయం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగినా..దానిని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు. సుప్రీంకోర్టులోనే న్యాయం జరగకపోతే దేశ ప్రజలు ఎక్కడి వెళ్లి చెప్పుకోవాలన్నారు. మోదీ ప్రభుత్వం దిల్లీ ప్రజలకు ఛాలెంజ్ చేస్తున్నారన్నారు. నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాన్ని కేంద్రం పాలన చేసుకోనివడం లేదని మండిపడ్డారు. ED, సీబీఐ పంపి బెదిరించి ఎమ్మెల్యేలను కొంటున్నారని, ప్రభుత్వాలను కూల్చుతారని ఆరోపించారు. రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని నాన్ బీజేపీ పార్టీలను కోరుతున్నానన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డుకోని మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు.

దేశం ఒక మాల... అన్ని రకాల పూలు ఉంటాయ్ -సీఎం భగవంత్ మాన్ సింగ్

దేశ ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని పంజాబ్ సీఎం మాన్ సింగ్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడిచేందుకు గవర్నర్ సహకరించలేదన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో నా ప్రభుత్వం అని చదువుతూ ప్రారంభించారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండియా... ఒకే పువ్వు ఉండటం కుదరదన్నారు. దేశం ఒక మాల లాంటిది మాలలో అన్ని రకాల పూలు ఉంటాయన్నారు.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.